28-01-2026 01:26:03 AM
అధికారులతో సమానంగా కార్మికులకు సౌకర్యాలు
కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మే రకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సింగరేణి ఉద్యోగుల మారుపేరు విషయానికి సంబంధించి తొందరగా పరిష్కారం చేస్తామని తెలిపారు.
మెడికల్ ఇన్వాల్యుయేషన్ సంబంధించి, వాళ్లకున్న జబ్బులకు సంబంధించి బోర్డు అన్ని విధాల పరిష్కారం చూపిస్తామన్నారు. కోల్ ఇండియా నిబంధన మేరకు సింగరేణిలో అధికారులకు సంబంధించిన అన్ని సౌకర్యాలను భరిస్తుందో అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు (టాక్స్) కల్పించడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఐఫోర్ కమిటీ నిర్ణయించి సొంతింటి కల సహకారం చేస్తుందని తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ దేశంలో ఎక్కడా లేని రీతిలో 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు.
సింగరేణి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం దేశవ్యాప్తంగా ఒక నమూనా పథకంగా గుర్తింపు పొందిందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం 40 లక్షల రూపాయల ఉచిత ప్రమా ద బీమా పథకం అమలు చేశామని తెలిపారు. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సింగరేణిలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2,539 పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు.
క్యాథ్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మా ర్చేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2024 సింగరేణి చరిత్రలో అత్యధిక లాభాలు (రూ. 6,394 కోట్లు) సాధించామని, అత్యధికంగా 34 శాతం లాభాల వాటా కింద 802 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించినట్లు వివరించారు. అలాగే ఔట్ సోర్సింగ్ సేవల సిబ్బందికి రూ.5,500 చొప్పున లాభాల వాటా చెల్లించినట్లు ఆయన వెల్లడించారు.