calender_icon.png 28 January, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయనను ఎందుకు నియమించారు?

28-01-2026 01:26:48 AM

  1. ఇంటెలిజెన్స్ ఐజీగా ప్రభాకర్‌రావు నియామకంపై సిట్ ప్రశ్నలు

ఏడు గంటల పాటు మాజీ ఎంపీ జోగినపల్లి విచారణ

అవసరమైతే మరోసారి పిలుస్తాం: సిట్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు లో దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఆరోపణ లు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావును మంగళవారం సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ రాత్రి 10.30 గంటల వరకు అంటే సుమారు 7 గంటల పాటు ఏకధాటిగా కొనసాగింది. ప్రధానంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు నియామకం, ఆ సమయంలో జరిగిన అనధికారిక కార్యకలాపాలపై అధికారులు సంతోష్ రావును నిలదీశారు.

ప్రభాకర్‌రావు వెనుక అదృశ్య హస్తం!

ప్రభాకర్‌రావు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ ఐజీగా, ఆపై కీలక బాధ్యతల్లో కొనసాగించడం వెనుక సంతోష్‌రావు ప్రభావం ఎంత ఉందనే కోణంలో విచారణ ప్రధానంగా సాగింది. సంతోష్‌రావు సిఫార్సుల మేరకే ప్రభాకర్ రావుకు ఆ స్థాయి పోస్టింగ్ ఇచ్చారా? ప్రభుత్వ నిర్ణయాల్లో సంతోష్‌రావు ఏ మేరకు జోక్యం చేసుకునేవారు? అన్న అంశాలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

ముఖ్యంగా, ప్రభాకర్‌రావు నేతృత్వంలోని టీమ్ సంతోష్‌రావుకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేదా అన్న అనుమానాలపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు. విచారణ సమయంలో సిట్ అధికారులు సంతోష్‌రావు ముందు కీలక డాక్యుమెంట్లను, డిజిటల్ ఆధారాలను ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టయిన ఇతర పోలీస్ అధికారుల స్టేట్మెంట్లు, ప్రభాకర్‌రావుతో సంతోష్‌రావు జరిపిన సంభాషణలు, ఫోన్ కాల్ డేటా, కొన్ని వాట్సాప్ చాట్లను చూపించి ఆయన వాగ్మూలాన్ని నమోదు చేశారు.

ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరెవరికి చేరింది? ఆ డేటాను రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు ఎలా ఉపయోగించుకున్నారు? అన్న కీలక ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు. కొన్ని ప్రశ్నలకు ఆయన గుర్తు లేదు అని దాటవేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

మరోసారి విచారణకు పిలిచే ఛాన్స్

సుమారు 7 గంటల విచారణ ముగిసిన అనంతరం సంతోష్‌రావు వెళ్లిపోయారు. ఆయన ఇచ్చిన కొన్ని సమాధానాలపై దర్యాప్తు అధికారులు సంతృప్తి చెందలేదని సమాచారం. స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటాను, సంతోష్‌రావు చెప్పిన విషయాలను విశ్లేషించిన తర్వాత, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్‌ను వెలికి తీయడమే లక్ష్యంగా సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో తదుపరి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.

బిగుస్తున్న ఉచ్చు.. తదుపరి అడుగు ఎటు?

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో, సంతోష్‌రావు విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్‌రావు.. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే సంతోష్‌రావుకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు సంతోష్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా ఈ కేసులో మరికొంత మంది రాజకీయ నేతలకు నోటీసులు అందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.