25-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్
మహబూబాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆత్మ గౌరవాన్ని మరింత పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు.
వడ్డీ లేని రుణంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, పేద కుటుంబాలకు గృహ జ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కు గ్యాస్ సిలిండర్, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి అద్దె బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లను అందజేస్తుందని చెప్పారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తే ప్రతి కుటుంబం చీకు చింత లేకుండా జీవించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు.
విద్యా, ఉపాధి, ఆర్దిక భద్రత, ఆరోగ్య భద్రత అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రతి మహిళ గర్వపడేలా ఇందిరమ్మ చీరలను ప్రత్యేకంగా సిరిసిల్ల కార్మికులతో తయారు చేయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడు రావుల మురళి, తహసిల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి తదితరులు పాల్గొన్నారు.