calender_icon.png 25 November, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

25-11-2025 12:48:22 AM

  1. 1935-2025
  2. హీ మ్యాన్
  3. ముంబైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ నట దిగ్గజం
  4. అంత్యక్రియలు పూర్తి
  5. కన్నీటిపర్యంతమైన సినీతారలు, అభిమానులు
  6. భారత సినీ చరిత్రలో ఒక శకం ముగిసింది : ప్రధాని నరేంద్ర మోదీ
  7. కొద్దిరోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతం

Click Here : సాహసం నా పథం.. రాజసం

* వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఇకలేరు. సోమవారం ముంబైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పవన్ హన్స్ శ్మశానవాటికలో ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ధర్మేంద్ర మృతికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, కళా రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ముంబై, నవంబర్ 24: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొద్దికాలం నుంచి వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం ముంబైలోని ఆ యన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత నెలలోనూ ఆయన అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆయన్ను ముం బైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌కు తరలించి వైద్యం చేయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్రను బాలీవుడ్ స్టార్స్ ఆమీర్‌ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పరామర్శించారు.

వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే ధర్మేం ద్ర మృతిచెందినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలను ధర్మేంద్ర సతీమణి తీవ్రంగా ఖండించారు. చికిత్స అనంతరం ధర్మేంద్రను ఇంటికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈక్రమంలోనే ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. కుటుంబ సభ్యులు పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమారుడు సన్నీ డియోల్ తండ్రికి తలకొరివిపెట్టారు.

సతీమణులు ప్రకాశ్ కౌర్, హేమామాలిని, కుమారుడు బాబీ డియోల్, కుమార్తెలు ఈషా డియోల్, అహానా డియోల్ సమక్షంలో మిగతా అంతిమ సంస్కారాలు జరిగాయి. సినీతారలు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, అనిల్ కపూర్, షభానా ఆజ్మీ, సలీం ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ దంపతులు వచ్చి ధర్మేంద్ర భౌతిక కాయానికి నివాళి అర్పించి చివరి వీడ్కోలు పలికారు. వేలాదిగా తరలివచ్చిన ధర్మేంద్ర అభిమానులతో శ్మశాన వాటిక నిండింది.

ప్రముఖుల సంతాపం

ధర్మేంద్ర మృతికి దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, కళా రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి మోదీ ‘ఎక్స్’ ద్వారా స్పంది స్తూ..‘ధర్మేంద్రజీ మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయింది. ఆయన వ్యక్తిత్వం, వినయ సంప న్న గుణాలు భావితరాలకూ ఆదర్శం’ అని ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘భారతీయ చిత్రపరిశ్రమ గొప్ప యాక్షన్ హీరోను కోల్పోయింది.

ధర్మేంద్ర భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన కుటుం బానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. నటుడు సల్మా న్ ఖాన్ స్పందిస్తూ‘ ధర్మేంద్రజీ నటులందరికీ స్ఫూర్తి. తెరపై మీరూపం ఎప్పటికీ అజరామరం’ అని కొనియాడారు. అలా గే పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.

హృదయం ముక్కలైంది: అమితాబ్ బచ్చన్

ధర్మేంద్ర మృతిపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘ఎక్స్’ ద్వారా భావోద్వేగంగా పోస్టు చేశారు. ‘నా ‘వీరు’( ‘షోలే’ చిత్రంలో ధర్మేంద్ర పాత్ర పేరు) ఇక భౌతికంగా లేడన్న విషయం నన్ను కలచివేస్తోంది. మరణ వార్త విన్న తర్వాత నా హృదయం ముక్కలైంది. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలాను. ధర్మేంద్రతో నాకు 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. అది సగటు నటుల మధ్య ఉండే అనుబంధం కాదు. మాది సోదరుల అనుబంధం. సోదరా.. నువ్వు లేని లోటును నా జీవితంలో ఎవరూ భర్తీ చేయలేరు. భారతీయ చిత్ర పరిశ్రమలోనూ నీ పాత్ర అజరామరం. ’ అంటూ ట్వీట్ చేశారు.