calender_icon.png 25 November, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహసం నా పథం.. రాజసం

25-11-2025 01:03:08 AM

  1. సామాన్య కుటుంబంలో పుట్టి.. అగ్రనటుడిగా ప్రస్థానం 
  2. ఎత్తుపల్లాలను అధిగమిస్తూ బాలీవుడ్ హీమ్యాన్, గ్రీక్ గాడ్, యాక్షన్‌కింగ్‌గా స్టార్‌డమ్

* వెండితెర ‘హీమ్యాన్’గా అభిమానులు కొలిచినా, ‘యాక్షన్ కింగ్’ అని సినీ ప్రేమికులు కొనియాడినా, ‘గ్రీక్ గాడ్’గా కుర్రకారు మనసులు దోచుకున్నా.. అది ధర్మేంద్రకే చెల్లింది. ఆయన నటనా ప్రస్థానం అమోఘం.. అద్వితీయం. ‘గరమ్ ధరమ్’గా ఆయన ఎల్లప్పుడూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఆయన ప్రస్థానం అజరామరం. ఆ దిగ్గజ నటుడి ప్రస్థానమిదే..! 

ముంబై, నవంబర్ 24: ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు ధరమ్‌సింగ్ డియోల్. తండ్రి కిషోర్‌సింగ్ డియోల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. వ్యవసాయం కూడా చేసేవాడు. ధర్మేంద్ర తన బాల్యం, ప్రాథమిక విద్య లాల్టన్ కలాన్‌లో సాగింది. సహ్నేవాల్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచే సినిమాలపై మక్కువ ఉండేది.

ఆ రోజుల్లో సినిమా లు చూసేందుకు స్వగ్రామం నుంచి పదుల కిలోమీటర్ల నడిచి వెళ్లేవారు. 1958లో సరిగ్గా 23 ఏళ్ల వయస్సులో ఆయన తన కలల నగరం బొంబాయికి చేరుకున్నాడు. న టుడు కావాలనే బలమైన కోరికతో సినీ స్టూడియోల చుట్టూ ప్రదక్షిణ చేశారు.  సినీ అవకాశా ల కోసం నిర్మాతలు, దర్శకుల చుట్టూ తిరిగి కొన్నిసార్లు నిరాశకు గురయ్యేవారు. అయినప్పటికీ వెరవకుండా రెండేళ్లపాటు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాలు కొనసాగించారు. 

అదృష్టం తలుపు తట్టిన క్షణాలు

‘ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్’ నిర్వహించిన ‘న్యూ టాలెంట్ కాంటెస్ట్’కు హాజరయ్యారు. ఈ పోటీల్లో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. బాలీవుడ్ తలుపులు తెరిచేందుకు ఆ పోటీ సోపానంగా పనిచేసింది. 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. ఆ చిత్రం విజయవంతం కావడంతో ఇక ధర్మేంద్ర వెనక్కి తిరిగి చూసుకోలేదు.

తర్వాత వరుసగా ‘షోలా ఔర్ షబ్నమ్’ (1961), ‘బాయ్ ఫ్రెండ్’ (1961), ‘సూరత్ ఔర్ సీరత్’ (1962), ‘అన్ పడ్’ (1962), ‘బందినీ’ (1963), ‘బీగార్’ (1963), ‘మేరీ సూరత్ తేరీ ఆంఖే’ (1963), ‘పూజా కే ఫూల్’ (1964), ‘హకీకత్’ (1964), ‘ఆయి మిలన్ కీ బేలా’ (1964), ‘మై భీ లడ్కీ హూ’ (1964), ‘చాంద్ ఔర్ సూరజ్’ (1965), ‘కాజల్’ (1965) చిత్రాలు ఆయన స్థానాన్ని బాలీవుడ్ చిత్రపరిశ్రమలో సుస్థిరం చేశాయి.

వైవాహిక జీవితం.. పిల్లలు

ధర్మేంద్రకు 1954లో ఆయనకు సంప్రదాయ కుటుంబానికి చెందిన ప్రకాష్ కౌర్‌తో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇద్దరు కుమార్తెలు విజేతా డియోల్, అజీతా డియోల్. ధర్మేంద్ర రెండో భార్య హేమా మాలిని. వీరిద్దరూ మొదటిసారి 1970లో ‘తుమ్ హసీన్ మై జవాన్’ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు.  దంపతులకు ఇద్దరు కుమార్తెలు - ఇషా డియోల్, అహానా డియోల్. 

‘చుప్ కే చుప్ కే’, ‘షోలే’ ప్రత్యేకం

ధర్మేంద్ర నటించిన చిత్రాల్లో ‘షోలే’ (1975) ప్రత్యేకం. ఈ చిత్రంలో ఆయన పోషించిన ‘వీరు’ పాత్ర అమోఘం. ఇప్పటికీ భారత చలన చిత్ర రంగంలో ఆ చిత్రం ఒక మైలురాయి. చిత్రంలో ధర్మేంద్ర స్నేహితుడిగా అమితాబ్ బచ్చన్ (‘జై’ పాత్ర) నటించారు. చిత్రంలో ధర్మేంద్ర హాస్యరసాన్ని పండించారు. తన చిలిపి చేష్టలతో తెరపై పండించిన హాస్యం ఇప్పటికీ సినీ ప్రేమికుల మదిలో నిలిచింది. ఈ సినిమాతోనే ధర్మేంద్ర, అమితాబ్ మంచి స్నేహితులయ్యారు.

అలా కేవలం ‘షోలే’ చిత్రంలోనే కాక మరిన్ని చిత్రాల్లోనూ వారు స్కీన్ పంచుకున్నారు. వీరి అనుబంధం కేవలం వృత్తిపరంగానే కాక, వ్యక్తిగతంగానూ చివరి వరకు సాగింది. అలాగే ధర్మేంద్ర నటించిన చిత్రాల్లో ‘చుప్ కే చుప్ కే’ కూడా ప్రత్యేకమైంది. హాస్య నటుడిగా ఆయన సామర్థ్యాన్ని చిత్రం ఆవిష్కరించింది. చిత్రంలో నకిలీ డ్రైవర్‌గా, నకిలీ ప్రొఫెసర్‌గా ద్విపాత్రాభినయం చేసిన తీరును ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

యాక్షన్ కింగ్‌గా పేరు

ధర్మేంద్రకు ‘హీ-మ్యాన్’ అనే పేరు ఉండేది. అందుకు కారణం ఆయన దేహ దారుఢ్యం. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన మునుపెన్నడూ, ఏ నటుడూ చూపించనంత తెగువ చూపించేవారు. మిగతా నటులకంటే ధర్మేంద్ర శక్తిమంతంగా కనిపించేవారు. అందుకే ఆయన్ను అభిమానులంతా ముద్దుగా ‘హీమ్యాన్’ అని పిలవడం ప్రారంభించారు. 1970 నాటికి ఆయనకు యాక్షన్ హీరోగా పేరొచ్చింది. 

నటి మీనాకుమారి ప్రోత్సాహం

ధర్మేంద్ర చిత్రసీమలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ఆయనకు అలనాటి మేటితార మీనాకుమారి ప్రోత్సాహం మెండుగా ఉండేది. ఆమె భర్త కమల్ అమ్రోహి నిర్మించిన ‘కైసే కహూ!’ (1964) అనే చిత్రంలో ధర్మేంద్రకు అవకాశం ఇప్పించింది. అంతకుముందు ఆమె ధర్మేంద్రతో కలిసి ‘మెయిన్ భీ లడకీ హూ’ (1964) అనే చిత్రంలో నటించింది. ధర్మేంద్రను మీనాకుమారి కేవలం సహ నటుడిగానే కాకుండా, మార్గనిర్దేశకురాలిగా వ్యవహరించింది. వృత్తిగతంగా ఎంతో ప్రోత్సహించింది.

గోల్డెన్ ఇయర్- 1971  

ధర్మేంద్రకు ‘1971’ సంవత్సరం సువర్ణాధ్యాయమని సినీ విశ్లేషకులు చెప్తుంటారు. ఆ ఏడాదిలో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఈ విజయాల పరంపరలోనే ఆయన అగ్ర నటుల జాబితాలో చేరారు. ఆ సినిమాలే ‘నయా జమానా’, ‘గుడ్డీ’, మేరా గాఁవ్ మేరా దేశ్’, ‘సీమా’, ‘రఖ్ వాలా’, ‘దో రాసే’, ‘పరాయ ధన్’.