25-11-2025 12:28:23 AM
హైదరాబాద్, నవంబర్ 24 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాన్ టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా వెంటాడుతోంది. సమయానికి బడి గంట కొట్టేవారు ఉండరు.. విద్యార్థులకు నీళ్లు తెచ్చేవారు కన్పించరు. స్కూళ్లలోని కంప్యూటర్లకు రక్షణ ఉండదు.. రాత్రిపూట పాఠశాల ప్రాంగణంలో ఇల్లీగల్ కార్యక్ర మాలను అడ్డుకునే నాథుడే లేడు. ఇది రాష్ట్రంలోని మెజార్టీ పాఠశాలల పరిస్థితి.
ఉండాల్సిన దానికంటే అతికొద్ది మందే ఉండడంతో ఆ భారం ఉపాధ్యాయులపైనే పడుతోంది. పాఠశాలల్లో స్వీపర్, అటెండర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, వాచ్‌మాన్ లాంటి పోస్టులను కేటాయించకున్నా.. ఉన్న వారితోనే నెట్టు కొస్తున్నారు. స్కూల్‌కు ఒకరు చొప్పున వేసుకున్నా 14 వేల మంది సిబ్బంది లేమి వేధిస్తోంది. వెరసి చివరకు నష్టపోతోంది విద్యార్థులే.
ఒక్కో స్కూల్‌లో ఒక్కోలా!
పాఠశాల విద్యాశాఖ ఇటీవల రూపొందించిన నివేదికలోని గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 24,997 సర్కారు బడు లు ఉన్నాయి. వీటిలో నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రం 10,224 మంది మాత్రమే ఉన్నారు. కనీసం ఒక పాఠశాలలో స్వీపర్, అటెండర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ఉండాల్సిందే. కానీ చాలా స్కూళ్లలో వీరు ఉండట్లేదు. ఎవరో ఒకరే ఉంటున్నారు. పాత పెద్ద స్కూళ్లలో ఉంటున్నారు తప్పితే వందల స్కూళ్లలో నాన్ టీచింగ్ స్టాఫ్ సరిపడా ఉండట్లేదు.
రాష్ట్రంలో 1,657 ప్రభుత్వ స్కూళ్లలో 1,001 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే, 22,587 లోకల్‌బాడీ (మండల పరిషత్, జిల్లాపరిషత్) స్కూళ్లలో కేవలం 3,733 మందే ఉండడం గమనార్హం. ఈ లెక్కన చూసుకుంటే 1,657 బడుల్లో వెయ్యి మంది ఉన్నప్పుడు, 22,587 బడుల్లో కనీసం 22 వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. కానీ పరిస్థితి అలా లేదు. ఇక 495 కేజీబీవీ విద్యాలయాల్లో ఏకంగా 4,682 మంది స్టాఫ్ ఉన్నారు. ఈ రకంగా చూసుకున్నా లోకల్ బాడీ స్కూళ్లలో భారీస్థాయిలోనే సిబ్బంది ఉండాలి.
194 మోడల్ స్కూళ్లలో 451 ఉంటే, 35 తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ బడుల్లో 174 మంది, 29 అర్బన్ రెసిడెన్షయల్ స్కూళ్ల (యూఆర్‌ఎస్)లో 183 మంది ఉన్నారు. కేజీబీవీ, మోడల్, టీఆర్‌ఈఐఎస్, యూఆర్‌ఎస్ పాఠశాలలతో పో ల్చుకుంటే ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్లలో నాన్ టీచిం గ్ స్టాఫ్‌ల్లో వ్యత్యాసం కనబడుతోంది. సరిపడా స్టాఫ్ లేకపోవడంతో రిజిస్టర్ల నిర్వహణ, టీసీజారీ, జీతభత్యాల బిల్లులు, జీపీఎఫ్, మెడికల్, పింఛన్, మధ్యాహ్న భోజనం కార్యక్రమం తదితర పనులన్నీ ఉపాధ్యాయులపైనే పడుతున్నాయి.
కార్యాలయాల్లో పదుల సంఖ్యలో సిబ్బంది
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అంధించేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిన నాన్ టీచింగ్ సిబ్బంది ఉండడంలేదు కానీ, మండల, జిల్లా కార్యాలయాల్లో మాత్రం ఉంటున్నారు. డీఈవో, మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అటెండర్లు, ఇతర సిబ్బంది ఉంటున్నారు. అవసరానికి మించి ఉంటున్నారనే విమర్శులున్నాయి. దీంతో డీఈవో, మండల పరిషత్, జిల్లా పరిషత్‌తోపాటు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాల యంలో ఉండే అదనపు నాన్‌టీచింగ్ సిబ్బందిని అవసరమున్న పాఠశాలలకు కేటాయిం చాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
62 వేల నాన్‌టీచింగ్ స్టాఫ్ అవసరం!
ఒక్కో బడిలో కనీసం ముగ్గురు చొప్పున నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్కూలు కు ఒక్కరు చొప్పున వేసుకున్నా ఇంకా 14 వేలమంది కొరత ఉంది. టీచర్ల అభిప్రాయం మేరకు అదే స్కూల్‌కు ముగ్గురు చొప్పున వేసుకుంటే 64,767 మంది నాన్‌టీచింగ్ స్టాఫ్ అవసరం అవుతారు. ప్రభు త్వం ఈ నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను వెంటనే నియమించి, సర్కారు బడుల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషిచేయాలని ఉపాధ్యాయ సంఘా లు కోరుతున్నాయి.
