25-11-2025 12:36:09 AM
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి) : పారిశ్రామిక భూములతో పాటు నగరంలోని భూముల అమ్మకాలపై జీహెచ్‌ఎం సమావేశాల్లో ప్రభు త్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించాల న్నారు. జీహెచ్‌ఎంసీలో పదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా ఎలాంటి అవినీ తికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని అభినందనలు తెలిపారు.
సోమవారం తెలం గాణ భవన్‌లో బీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జీహెఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేడు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు ఈ సందర్భంగా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
రెండోసారి జీహెచ్‌ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలను అందించిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ర్టంలో ప్రజలు పార్టీకి ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఉన్న కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా ఎన్నికలను పోరాడిన తీరును అభినందించారు.
పార్టీ వెంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్‌కీ భవిష్యత్‌లో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్‌లో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకొని పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్పొరేటర్లకి రానున్న కాలంలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో మంచి భవిష్యత్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈనెల 29వ తేదీన జరగనున్న దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు. దీక్షా దివాస్ సంబరాలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో చేయనున్న ఏర్పాట్లపైన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.
దశాబ్దాల తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు జరిగినా, కేసీఆర్ దీక్ష తర్వాతనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇంతటి గొప్ప ఘట్టాన్ని ప్రజలందరికీ మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా ఈనెల 29వ తేదీన హైదరాబాద్ నగరంలో భారీగా దీక్షా దివాస్‌ను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.