23 June, 2026 | 12:52 AM

సంగారెడ్డికి సరికొత్త ల్యాండ్‌మార్క్!

23-06-2026 12:00 AM
  1. 500 కోట్లతో కింది బజార్ చెరువుకు మహర్దశ 
  2. దశాబ్దాల కలకు మోక్షం 
  3. ఫలించిన జగ్గారెడ్డి కృషి 
  4. అంతర్జాతీయ స్థాయిలో చెరువు సుందరీకరణ
  5. పర్యాటక హబ్‌గా మారనున్న సంగారెడ్డి 

సంగారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): పరిశ్రమలు, విద్యాసంస్థలకు నిలయమైన సంగారెడ్డి జిల్లా కేంద్రం ఇప్పుడు పర్యాటక రంగంలోనూ సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. నిజాం కాలం నాటి చారిత్రక కింది బజార్ చెరువును అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన అర్బన్ టూరిస్ట్ ప్రాం తంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రతిపాదనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రూ.500 కోట్ల నిధులతో పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), రెవెన్యూ శాఖల సంయుక్త బృందం చెరువు పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసింది. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. 

వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, లేజర్ షోలు

ఈ ప్రాజెక్ట్ కింద కింది బజార్ చెరువు సుందరీకరణతో పాటు దాదాపు 3 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను నిర్మిస్తారు. రాత్రి వేళల్లో పర్యాటకులను ఆకర్షించేలా లేజర్ షోలు, ఫ్లోటింగ్ ఫౌంటైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోటింగ్ డెక్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ వంటి దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలు జిల్లాలో ఉన్నప్పటికీ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెంచాలనే డిమాండ్ ఉంది. ఈ టూరిజం ప్రాజెక్ట్ ద్వారా వందలాది మంది స్థానికులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.

హెచ్‌ఎండీఏ, -రెవెన్యూ సంయుక్తంగా..

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది. చెరువు పూర్తి నీటి మట్టం పరిధిని డిజిటల్ మ్యాపింగ్ ద్వారా గుర్తిస్తూ, గతంలో జరిగిన అక్రమ ఆక్రమణలను ముందస్తు నోటీసులతో తొలగించేందుకు రెవెన్యూ యంత్రాంగం కఠినమైన కార్యాచరణను సిద్ధం చేసింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. కేవలం పర్యాటకమే కాకుండా, పట్టణంలోని డ్రైనేజీ వ్యర్థాలు ఈ చారిత్రక సరస్సులోకి కలవకుండా రూ.80 కోట్లతో అత్యాధునిక అండర్‌గ్రౌండ్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటుకు నివేదికలు పంపాలని ఆదేశించారు.

పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం, జహీరాబాద్ ఎకనామిక్ జోన్ తరహాలోనే సంగారెడ్డి టౌన్ చుట్టుపక్కల ఉండే స్థానిక యువతకు ఈ ప్రాజెక్ట్ పెద్ద వరంగా మారనుంది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే మల్టీ-క్యూసిన్ ఫుడ్ కోర్టులు, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్, వాటర్ స్పోరట్స్ మేనేజ్మెంట్ల ద్వారా కనీసం 1,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కింది బజార్ చెరువును గుర్రపుడెక్క, గుర్రపు జిల్లేడు ప్లాంట్ల నుండి పూర్తిగా ప్రక్షాళన చేయడం ద్వారా  భూగర్భ జలమట్టం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావులకు, మత్స్యకారుల సొసైటీల జీవనోపాధికి దీర్ఘకాలిక భరోసానిస్తుంది.