25-07-2024 12:17:06 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 24 (విజయక్రాంతి): ఒక వ్యక్తికి ముగ్గురు కుమారులు. అతడికి నగర శివారులో ఎనిమిది గుంటల భూమి ఉంది. అతడు కాలం చేసేలోపు తన ఇద్దరు కుమారులూ మృతిచెందారు. చట్ట ప్రకారం ఆ వ్యక్తిపై ఉన్న ఎనిమిది గుంటల భూమి అతడి ముగ్గురు కొడుకుల వారసులకు 0.2.6 గుంటల చొప్పున దక్కాలి. కానీ తహసీల్దారు మరో వారసురాలికి తెలియకుండా కేవలం ఇద్దరు వారసులకు చెరో నాలుగు గుంటల చొప్పున ఎనిమిది గుంటల భూమిని రాసిచ్చేసింది. మూడో వారసులు ఉన్నట్లు తహసీల్దారుకు తెలియకుండా చేసిందనుకుంటే పప్పులో కాలేసినట్లే.
ఎందు కంటే.. ఈ వ్యవహారం అంతా ఆ ఎమ్మార్వోకు తెలిసే జరిగింది. గతంలో ఆ మం డలంలో పని చేసిన ఓ ఇద్దరు ఎమ్మార్వోలు తిరస్కరించారు. కానీ రెవెన్యూ ఉద్యోగుల యూనియన్ లీడర్‌గా చెలామణిలో ఉన్న ప్రస్తుత ఎమ్మార్వో మాత్రం మరో వారసురలి అభ్యంతరాన్ని తిరస్కరించి ఇద్దరి పేర ధరణిలో సక్సేషన్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు లబోదిబోమంటూ న్యా యం చేయాలని ఎమ్మార్వో కాళ్లావేళ్లా పడి నా ఆమె కనికరించలేదు.
చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నేనేమి చేయలేను, కోర్టుకు పో అంటూ బాధితురాలికి ఉచిత సలహా ఇచ్చారు. న్యాయం చేయాలని బాధితురాలు కలెక్టర్, సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలి తం శూన్యం. ఆ ఒంటరి మహిళ పేరు ఉమ. ఆమె వేదనకు కారణం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మండల తహసీల్దార్ శైలజ. లంచం ఇస్తే చాలా మేడం..? మా భూమిని ఇతరులకు రాసిస్తారా? అంటూ ఎమ్మార్వోను నిలదీస్తూ తనకు జరిగిన అన్యా యాన్ని ఉమ ‘విజయక్రాంతి’తో పంచుకున్నది. ఆమె మాటల్లోనే..
అది వారసత్వ భూమి
మాది మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామం. మా గ్రామం ప్రస్తుతం మేడ్చల్ మున్సిపాలిటీలో కలిసింది. మా మామ బాసురాది బాలయ్యకు ముగ్గురు కొడుకులు మల్లేశ్, వీరేశ్, కృష్ణ. వీరిలో పెద్దో డైన మల్లేశ్ భార్యను నేను. మాకు ముగ్గు రు బిడ్డలు. నా భర్త మల్లేశ్ 2005 మే 16న చనిపోయాడు. ఆయన చనిపోయిన కొద్ది రోజులకే 2005 జూలై 1న మా మామ చనిపోయాడు. అంతకు ముందే మా చిన్న మరిది కృష్ణ చనిపోయాడు. అయితే మా మామ బాలయ్యకు గిర్మాపూర్‌లోని సర్వేనంబర్ 137/3/1లో కొంత భూమితో పాటు సర్వే నెంబర్ 41లో 8 గుంటల భూమి ఉంది. ఇది మేడ్చల్ పట్టణంలోని 9వ వార్డులో ఉంటుంది. ఈ భూమిని నాతో పాటు మరో ఇద్దరు వారసుల పేర చేయా ల్సి ఉండగా, రెండో మరిది వీరేశ్ పేర 4 గుంటలు, చిన్న మరిది భార్య కళావతి పేర 4 గుంటలను తహసీల్దార్ ధరణిలో సక్సేషన్ చేశారు.
రూ.1.26కోట్ల విలువైన భూమిలో...
మేడ్చల్ మున్సిపాలిటీ పరధిలోని గిర్మాపూర్ సర్వే నెంబర్ 41లోని 8 గుంటల భూమి విలువ తక్కువలో తక్కువ రూ.1.26 కోట్ల వరకు ఉంటుంది. దీనిలో ఉమకు రావాల్సిన 0.2.6 గుంటల భూమి విలువ రూ.42.16 లక్షల వరకు ఉంటుంది. కానీ రూ.1.26 కోట్ల విలువైన భూమిలో ఎమ్మార్వో వాటా ఎంతో చెప్పాలని బాధితురాలు డిమాండ్ చేస్తున్నది. ఎమ్మార్వో కారణంగా తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ ఎమ్మార్వోపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎం రేవంత్‌రెడ్డిని ఒంటరి మహిళ ఉమ వేడుకుంటున్నది. భూమి సక్సేషన్ వ్యవహారంపై ‘విజయక్రాంతి ప్రతినిధి’ ఎమ్మార్వో శైలజను ఫోన్ లో సంప్రదించగా ఆమె స్పందించలేదు.
మా అభ్యంతరాలను పట్టించుకోలేదు
మా మామ పేర గిర్మాపూర్‌లోని సర్వే నెంబర్ 41లో ఉన్న భూమిని తమకు తెలియకుండానే సక్సేషన్ చేసుకునేందుకు వీరేశ్, కళావతి ప్రయత్నిస్తున్నారని, వారి దరఖాస్తులను తిరస్కరించాలని నేను 2022 జూన్ 18న మేడ్చల్ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశాను. ఫిర్యాదుపై గతంలో ఇద్దరు తహసీల్దార్లు విచారించి వీరేశ్, కళావతి పెట్టుకున్న దరఖాస్తులను సక్సేషన్ చేయకుండా నాలుగుసార్లు తిరస్కరించారు. ఆ తర్వాత ఎమ్మార్వో శైలజ మా కుటుంబీకులకు తెలియకుండా, నా సంతకం ఫోర్జరీ చేసి ధరణిలో సక్సేషన్ దరఖాస్తును తిరస్కరించాలని 2024 జనవరి 18న ఫిర్యాదు చేశాను. కానీ నా ఫిర్యాదును విస్మరించి ఎమ్మార్వో 2024 జూన్ 21న ధరణిలో వీరేశ్, కళావతికి సక్సేషన్ చేశారు.
కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు
నాకు పెళ్లీడుకొచ్చిన ఆడబిడ్డ ఉంది. ఈ భూమి మాకు దక్కకుంటే జీవికే లేదు. నేను వెళ్లి ఎమ్మార్వో కాళ్లావేళ్లా పడినా ఎమ్మార్వో కనికరించలేదు. ఎమ్మార్వో చేసిన నిర్వాకంపై మేడ్చల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశా. మళ్లీ కలెక్టర్ ఆఫీసులోని ఇన్‌వార్డుతో పాటు సీఎం ప్రజావాణిలోను ఫిర్యాదు చేశా. ఇటీవల మేడ్చల్ కలెక్టరేట్‌లోని ప్రజావాణిలోని కలెక్టర్‌కు మళ్లీ ఫిర్యాదు చేసి నా గోడు చెప్పుకున్నా. అడిషనల్ కలెక్టర్‌కు నా సమస్యను అప్పగించారు. కానీ నేటి వరకు నాకు న్యాయం జరగలేదు. భూమి దక్కితే నా బిడ్డ పెళ్లి చేద్దామనుకున్నా. కానీ ఆ ఎమ్మార్వో నా ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. న్యాయం చేయాలని అడిగిన తమకు లీగల్ నోటీసులు పంపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఉమ ఆవేదన వ్యక్తం చేసింది.