25-07-2024 12:18:32 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): నగరంలోని కూల్సుంపురాలో అగ్నిప్రమాదం సంభవించి తండ్రీ కుమార్తె ఆహుతయ్యారు. ఇదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. జియాగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో సోఫా తయారీ గోదాములో మంగళవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ సంభవించి దట్టమైన పొగలతో మంటలు వచ్చాయి. మంటలు క్రమంగా పైఫ్లోర్లకు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న 25 మందిని తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అపార్ట్‌మెంట్ పైఅంతస్థులో విగత జీవులుగా తండ్రి శ్రీనివాస్(40), అతడి కుమార్తె శివప్రియ(10)ను గుర్తించారు. తీవ్రగాయాలతో ఉన్న శ్రీనివాస్ భార్య నాగరాణి, మరో కుమార్తె హరిణిను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గోదాం యజమాని ధనుంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.