12-08-2025 07:14:00 PM
వలిగొండ (విజయక్రాంతి): వర్కట్ పల్లి-నేలపట్ల గ్రామాల మధ్యన గల ఈదుల వాగుపై వంతెన నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి(CPM Mandal Secretary Sirpangi Swamy) డిమాండ్ చేశారు. మంగళవారం రోజున వర్కట్ పల్లి-నేలపట్ల గ్రామాల మధ్యన ఉన్న ఈదుల వాగులో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దశాబ్దాలుగా అనేకమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న పాలకులు మారుతున్నారే తప్ప వంతెన నిర్మాణం చేయలేకపోయారని విమర్శించారు. భువనగిరి నియోజకవర్గ చివరి గ్రామంగా ఉన్న వర్కట్పల్లి-మునుగోడు నియోజకవర్గం చివరి గ్రామంగా ఉన్న నేలపట్ల గ్రామాల మధ్యన చిన్నపాటి వర్షాలు కురిసిన ఈదుల వాగులో నీరు ప్రవహించి ప్రయాణికులతో పాటు వివిధ పరిశ్రమల్లో, వివిధ పనుల కోసం చౌటుప్పల్ కు వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఇటీవల కాలంలో వాగులో కారులో ఏడుమంది చిక్కుకుపోయారని స్థానికుల సహకారంతో తమ ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బ్రిడ్జి నిర్మాణం కోసం తగిన నిధులు కేటాయించి బ్రిడ్జిని నిర్మించాలని, అదేవిధంగా పొద్దుటూరు, వర్కట్ పల్లి గ్రామాల మధ్యన అధ్వానంగా మారిన రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు బుచ్చిరెడ్డి, మెట్టు రవీందర్ రెడ్డి, చేగురి నరసింహ తదితరులు పాల్గొన్నారు.