12-08-2025 09:02:48 PM
నకిరేకల్ (విజయక్రాంతి): మూసీ నీటి ప్రవాహం వల్ల కేతేపల్లి మండలం భీమారం వద్ద ఉన్నలో లెవెల్ కాజ్ వే పై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. మంగళవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar)తో కలిసి మూసి డ్యామ్ ను సందర్శించారు. నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో మూసి ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, అలాగే ప్రాజెక్టు వద్ద ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గేట్లకు సంబంధించి, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి బయటికి పంపిస్తున్న నీటి వివరాలను అడగగా 13000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు.
అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలు కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామం వద్ద ఉన్న లో లెవెల్ కాజ్ వే ను తనిఖీ చేశారు.మూసి నుండి ఎక్కువ నీరు విడుదల చేసినా, లేదా ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షం కారణంగా నీటి ప్రవాహం ఎక్కువైతే కాజ్ వే పై నుండి నీరు ప్రవహిస్తుందని, 20 వేల క్యూసెక్కులు మూసి నుండి వదిలినప్పుడు మాత్రమే సమస్య ఉత్పన్నం అవుతుందని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. భీమారం లో లెవెల్ కాజ్ వే గుండా ప్రయాణం చేసే వారిని అవసరమైతే ముందుగానే అప్రమత్తం చేయాలని,భీమారం, కొప్పోలు నుండి రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు, వరద ప్రవాహం పెరిగినప్పుడు అవసరమైతే కాజ్ వే పై రాకపోకలు నిలిపివేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలనిఆమె ఆదేశించారు.వారి వెంట మూసి ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ .వెంకటరమణ, డిఇ చంద్రశేఖర్, జేఈ లు కీర్తి,కేతేపల్లి డి ఇ వాణి, ఎంపిడిఓ శ్రీనివాస సాగర్, తహసిల్దార్, తదితరులు ఉన్నారు.