calender_icon.png 13 August, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం కేసులో నిందితులు అరెస్ట్

12-08-2025 09:31:22 PM

ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి కె శివరాంరెడ్డి..

నకిరేకల్ (విజయక్రాంతి): పట్టపగలు ఇండ్ల తాళాలు పగలకొట్టి ఇండ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి, నగద దొంగిలించుకుపోతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నల్గొండ డిఎస్పి కే. శివరాంరెడ్డి(DSP K. Sivaram Reddy) తెలిపారు. మంగళవారం సాయంత్రం నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నార్కట్ పల్లి మండల కేంద్రానికి చెందిన వల్లమల్ల ప్రదీప్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైనర్ బాలిక తో కలిసి తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతుండేవారని తెలిపారు. జూలై 3న నకిరేకల్ పట్టణంలోని చీమల గడ్డ కాలనీకి చెందిన పరడ సుమలత తన ఇంటికి తాళం వేసి కూలికి పోగా కూతురు ఆడుకోవడానికి బయటకి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును దొంగిలించుకుపోయినట్లు సుమలత నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని తెలిపారు.

ఈ దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 12న చందుపట్ల స్టేజి వద్ద నకిరేకల్ - తిప్పర్తి రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాసదంగా స్కూటీపై తిప్పర్తి వైపు నుండి నకిరేకల్ వైపు వస్తుండగా ప్రదీప్ ను పట్టుబడి చేసి విచారించినట్లు తెలిపారు. గతంలో మైనర్ గా ఉన్నప్పుడు నకిరేకల్, శాలిగౌరారం, కట్టంగూర్, నార్కట్ పల్లి, నల్లగొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 దొంగతనాలు చేసి జువైనల్ హోమ్, జైలుకు వెళ్లినట్లు తెలిపారు. నకిరేకల్ దొంగతనం కేసులో 8 నెలలు జైలు శిక్ష అనుభవించి డిసెంబర్ 2024 లో జైలు నుండి విడుదలైనట్లు వివరించారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లి పరిచయం ఉన్న మైనర్ బాలికతో చెడు వ్యసనాలకు బానిసై విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే నకిరేకల్, కట్టంగూర్, చిట్యాల, నల్లగొండ టౌన్, నల్లగొండ రూరల్, నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రదీప్ తో పాటు మైనర్ బాలిక పట్టపగలు తాళాలు వేసిన ఇండ్లలో చొరబడి బంగారు, వెండి, నగదు, సెల్ ఫోన్ లు దొంగిలించే వారిని తెలిపారు.  వారి నుండి రూ. 7,84,000 విలువగల ఐదు తులాల ఒక గ్రాము బంగారం, 119 తులాల వెండి, రూ. 45 వేల నగదు, ఒక స్కూటీ, రెండు సెల్ ఫోన్లు, ఒక ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ను చేదించిన  నకిరేకల్ సిఐ రాజశేఖర్,  శాలిగౌరారం సిఐ  కొండల్ రెడ్డి .ఎస్సైలు బి. లచ్చిరెడ్డి, జి. కృష్ణ చారి, క్లూస్ టీం ఎస్ఐ శివ, సిబ్బంది వై. వెంకటేశ్వర్లు, డి. శ్రీకాంత్, ఎం. శ్రీను, కె. జనార్ధన్, బి.మధుకర్, వి. సురేష్, ఏ. సుధాకర్, ఎం. నాగార్జున, శ్రీనివాస్ లను డిఎస్పి అభినందించారు.