చివరి లబ్ధిదారుని వరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, జూలై 2 (విజయక్రాంతి): ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని, కరీంనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వం రెండవసారి ఇచ్చిన మంజూరు కలుపుకొని ఇంకా 3 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు ఇచ్చే అవకాశం ఉందని, చివరి లబ్ధిదారు వరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
గురువారం 25 వ డివిజన్ రోడ్ నెంబర్ 9 లోని లబ్ధిదారుడు గంగాధర కనుకయ్య భాగ్యలక్ష్మిల గృహ ప్రవేశానికి స్థానిక కార్పోరేటర్ గంట శ్రీనివాస్ తో కలిసి తుడా చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు డబుల్ బెడ్రూం ఇండ్లిస్తామని మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన చివరి లబ్ధిదారుని వరకు ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంట కల్యాణి, దండి రవీందర్, జె.లక్ష్మణ్, రాజారాం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






