17 April, 2026 | 3:24 AM

అందరికీ కనెక్ట్ అయ్యే క్యాస్ట్ కథ

17-04-2026 12:00 AM

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో ఏకే జంపన్న రచనాదర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘క్యాస్ట్’. కశికా కపూర్, దివి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ గురువారం లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడు చాలా కొత్త, డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది. ఇందులో చాలా బలమైన క్యారెక్టర్ చేశాను. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని చాలా అందంగా చూపించారు. అందరికీ కనెక్ట్ అవుతుంది” అన్నారు. డైరెక్టర్ ఏకే జంపన్న మాట్లాడుతూ.. “మనం చేసే పనిని బట్టి కులాన్ని నిర్ణయించే రోజుల్లో అంత బాగుండేది.

కానీ మనిషి పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించడం మొదలైనప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. కులం అనేది మనిషికీ మనిషికి మధ్య ఒక అడ్డు గోడగా మారింది. ఈ సినిమాను చాలా కమర్షియల్‌గా చెబుతున్నాను. ఈ సినిమా అందరికి చాలా రోజులు గుర్తుండిపోతుందని నమ్ముతున్నా” అని తెలిపారు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. జూన్లో విడుదల చేయాలనుకుంటున్నాం. 90% షూటింగ్ పూర్తయ్యింద’ని నిర్మాత కోటేశ్వరరావు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో గగన్‌బాబు, సత్యం రాజేశ్, రవి కూడా మాట్లాడారు.