calender_icon.png 23 August, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో సీనియర్ హీరోతో ఛాన్స్!

23-08-2025 12:27:07 AM

చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల నుంచి వస్తున్న సినిమాలు చాలా తక్కువే. ఏడాదిలో ఏ ఒక్కసారో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఒకింత కష్టంగానే మారింది. సీనియర్ హీరోల పక్కన అవకాశం అంటే యంగ్ బ్యూటీలు ఆలోచిస్తుండటమే ఇందుకు కారణం. ప్రేక్షకులు కూడా సీనియర్లతో జతకట్టిన హీరోయిన్లను యువ హీరోల పక్కన చూడలేకపోతారు.

ఈ లెక్కలేవీ తనకు అక్కర్లేదు అనుకుంటుందో ఏమో ఆషికా రంగనాథ్. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇటు యువ హీరోలు.. అటు సీనియర్ హీరోల పక్కన హీరోయిన్‌గా వస్తున్న అవకాశాలన్నింటినీ స్వీకరిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ఈ భామకు సీనియర్ హీరోల సినిమా ఛాన్సులే ఎక్కువగా వస్తున్నాయి. కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆషికా ఆ తర్వాత నాగార్జునతో ‘నా సామిరంగ’లో నటించింది.

ఆ తర్వాత ఈ బ్యూటీకి మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘విశ్వంభర’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడీ మూవీ షూటింగ్ జరుగుతుండగానే మరో బంపర్ ఆఫర్ అందుకుంది ఆషికా. రవితేజ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్‌గా ఆషికానే ఎంపికైనట్టు తెలుస్తోంది. రవితేజ ఇప్పుడు ‘మాస్ జాతర’లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో చేయనున్నారు. ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలోనే హీరోయిన్‌గా ఆషికాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.