calender_icon.png 20 December, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగుల అన్వేషణలో ప్రతిభాప్రదర్శన

20-12-2025 12:00:00 AM

పటాన్ చెరు, డిసెంబర్ 19 : జీఎస్ హెచ్‌ఎస్ లోని లలిత కళల విభాగం ఆధ్వర్యంలో రంగు అధ్యయన కోర్సు ఫలితాలను ప్రదర్శించే ప్రదర్శనను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ఇందులో రంగు సిద్ధాంతం, దాని వ్యక్తీకరణ వినియోగాల యొక్క లోతైన విశ్లేషణను ప్రతిబింబించేలా విద్యార్థులు కళాకృతులను ప్రదర్శించారు. రంగుల ప్రాథమిక అంశాలు, రంగు ప్రణాళిక, దృశ్య సంభాషణలో వాటి పాత్ర యొక్క సమగ్ర అధ్యయనం ద్వారా అభివృద్ధి చేసిన వాటిని ప్రదర్శించారు.

పాఠ్యాంశాలలో భాగంగా, విద్యార్థులు లియోనార్డో డా విన్సీ, పాబ్లో పికాసో, విన్సెంట్ వాన్ గోహ్, సాల్వడార్ డాలీ, రాజా రవివర్మ, జామిని రాయ్ వంటి ప్రముఖ కళాకారులచే ప్రేరణ పొందిన మాస్టర్ కలర్ స్కీములను విశ్లేషించి సాధన చేశారు. ఈ కోర్సు చరిత్ర పూర్వం నుంచి వర్తమాన కాలం వరకు కళాత్మక సంప్రదాయాలను ప్రతిబింబించడమే గాక, భారతీయ, పాశ్చాత్య కళా ధోరణులను కలిగి ఉంది.

ఇవన్నీ రంగుల వినియోగంపై విస్తృత చారిత్రక, సమకాలీన దృక్పథాన్ని విద్యార్థులకు అందించాయి. లలిత కళల విభాగం ఆచార్యుడు డాక్టర్ ఆదిశేషయ్య సాడే మార్గదర్శనంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు ప్రారంభించారు.

జీఎస్ హెచ్‌ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ శామ్యూల్ థరూర్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, కోర్సు సమన్వయకర్త డాక్టర్ లలిత సింధూరి తదితరులు విద్యార్థుల సృజనాత్మకత, కళాకృతులలో ప్రదర్శించిన విద్యాపరమైన నైపుణ్యాలను అభినందించారు. రంగును శక్తివంత మైన దృశ్య భాషగా విద్యార్థులు అర్థం చేసుకున్నందుకు, నిర్మాణాత్మక కళా విద్య యొక్క ప్రభావానికి ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.