01-01-2026 01:27:47 AM
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): డ్రగ్స్‌పై 2025 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. వందలాదిగా దాడులు నిర్వహించి.. 11,741 కేసులను నమోదు చేసింది. వేల కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ కమిషనర్ ఎస్.హరికిరణ్ వెల్లడించారు. ‘2025లో 11,741కేసులు నమోదు చేయగా, 11,500 మందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అరెస్టు చేసింది. ఈ దాడుల్లో 102 వాహనాలను, రూ.1.15 కోట్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.
2024లో నమోదైన 808 కేసులతో పోలిస్తే 2025లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ విభాగం ద్వారా 2025లో 1,304 కేసులు నమోదు కాగా, 2,333 మంది నిందితులు అరెస్టయ్యారు. ఈ కేసుల్లో 746 వాహనాలు, 5,505 కిలోల గంజాయి, 1,646 కిలోల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ నియంత్రణలో భాగం గా కొకైన్, హెరాయిన్, మెఫెడ్రోన్, ఎల్‌ఎస్డీ, ఎక్స్టసీ వంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగించారు. 72.54 కిలోల గంజాయి చాక్లెట్లు, 728.2 గ్రాముల మెఫెడ్రోన్, 105.27 గ్రాముల కొకైన్, 127 గ్రాముల హెరాయిన్, 228 గ్రాముల ఎండీఎంఏ, 36.79 కిలోల ఆల్కహాల్ బేస్డ్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.9.40 కోట్లుగా అంచనా వేశారు.
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు
ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 410 కిలోల గంజాయి, నారాయణపేటలో 425 కిలోల గంజాయి, 1.2 కిలోల ఆల్కహాల్, పాల్వంచలో 106 కిలోల గంజాయి, 6 పిస్టల్స్, 40 బుల్లెట్లు, సూర్యపేటలో 162 క్వింటాళ్ల అక్రమ మద్యం, ముడి సరుకు, సంగారెడ్డిలో 205 కిలోల గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు.
నాటు సారా నియంత్రణ
నాటు సారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. 2024లో 1.07 లక్షల లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోగా, 2025లో ఈ సంఖ్యను 67 వేల లీటర్లకు తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 3,07,557 కేసులు, 31,981 లీటర్ల మద్యం, 2,204 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.39 కోట్ల జరిమానాలను విధించారు. 8.22 లక్షల లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశారు.