13-12-2024 12:00:00 AM
గిట్టుబాటు ధర లేక ఆహార వస్తువుల విసర్జన ఎక్కువయ్యింది. టమాటా, మిర్చి ధరలు పూర్తిగా నేల చూపు చూస్తున్నాయి. ముఖ్యంగా టమాట రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటకు ధర రాక దిగాలు పడే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. రాష్ట్రంలో పలు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈసారి టమాట పంటసాగు చేశారు. ఎక్కువ దిగుబడి ఉంది. అయితే ప్రస్తుతం టమాటా రైతుల పరిస్థితి ‘అమ్మబోతే అడవి కొనబోతే కొరివి’ అన్న చం దంగా తయారైంది.
రాయలసీమలో విస్తారంగా పండే టమాటా ఎక్కువగా మదన పల్లి, కోలార్, చిక్ బల్లాపూర్ మార్కెట్లకు వెళుతుంది. అక్కడ గ్రేడింగ్ అయిన తరువాత మళ్ళీ రాయలసీమలోని అనంత పురం, కర్నూలు మీదుగా హైదరాబాద్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు వెళుతుంది. మార్కెట్టుకు తీసుకువచ్చిన టమాటా ధర కిలో రెండు రూపాయలకు పడిపోవడంతో అక్కడ రైతులు రోడ్డుపై పారబోసి, పశువులకు మేతగా వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆలూరు, పత్తికొండ కర్నూలులో టమాటో కిలో రెండు రూపాయలుంటే, హైదరాబాద్‌లో ముప్పు రూపాయలు పలుకుతోంది. కర్నూలు లో ఉల్లి క్వింటా ల్ రూ.2400 ఉంటే అదే ఉల్లి హైదరాబాద్ లో రూ.4000 ఉంది. రవాణా ఖర్చు విపరీతంగా పెరగడంతో సుదూర ప్రాంతాల్లో మార్కెట్‌కు సరుకు తరలించ లేక పోతున్నారు.
గత మూడు సంవత్సరాల నుండి ధరల స్థిరీకరణ అనేది లేదు. రెండు సంవత్సరాలుగా వ్యవసాయ పను లు రెట్టింపు అయ్యాయి. గతంలో టమోటా నారు వంద మొక్కలకు 60 రూపాయలుఉంటే ఇప్పుడు వంద రూపాయలు. దుక్కి చేయడానికి, గట్లు చేయడా నికి గతంలో ఎకరాకు రూ.1200 వ్యయం అయ్యేది. ఇప్పుడు 3000 రూపాయలు అవుతోంది. రవాణా, టోల్ చార్జీలు, కూలీ ల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏ పంట ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలిపే నాథుడే లేడు. వ్యవసాయ అధికారులు గణాంకాలు పూర్తిగా మరచి పోయారు.
వ్యవసా యం జూదంగా మారింది. గ్రామాల్లో చాలా మంది రైతులు టమాటా పంటను సాగు చేస్తున్నారు. నిత్యం టమాట, మిర్చి వేకువ జామున మినీ ట్రక్కులు, ఆటోల్లో మార్కెట్టుకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కానీ టమాటా ధర ఒకే సారి కిలో రెండు రూపాయలు, 35 కిలోల బుట్ట 80 నుంచి 100 రూపాయల వరకు పలికింది. సగానికిపైగా ధర తగ్గించేశారని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు పెట్టి న పెట్టుబడులు, రవాణా చార్జీలు కూడా రాని పరిస్థితి రావడంతో కన్నెర్ర చేశారు. వ్యాపారులకు అమ్మే బదులు రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. రైతు నిర్ణయించాల్సిన ధరను వ్యాపారులు నిర్ణ యం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
రైతు సంక్షేమం మరిచిన ప్రభుత్వాలు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బూటకపు మాటలు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతుల సంక్షేమం గురించి పట్టించు కోకుండా సంబరాలు జరుపుకొంటున్నారు. రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పూర్తిగా విస్మరించారు, రైతు బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, మంచి విత్తనం, యూరియా, కంపోస్ట్, డీఏపి, ఫంగిసైడ్ ఎరువులు అందుబాటులో లేవు. గత దశాబ్ద కాలంగా కోల్ స్టోరేజ్ యూనిట్స్, ధాన్యం నిలువ చేసుకోవడానికి వేర్ హౌస్‌లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అసమర్థ రవాణా వ్యవస్థ కారణంగా పెద్ద మొత్తంలో కూరగాయలు పొలాల్లో కుళ్లిపోతున్నాయి. సప్లు చైన్( సరఫరా గొలుసు) అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడం, దాని సంక్లిష్టతలు సాధారణ రవాణాకు మించినవి. సరఫరా గొలుసు వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీ, డెలివరీతో సహా వివిధ దశలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఉత్పత్తులు తమ ఉద్దేశించిన గమ్యస్థానాలకు సమర్థవంతంగా చేరుకోవడానికి దోహదం చేస్తాయి.
రైతు ఆత్మహత్యల సమస్య నిజానికి ఒక విషాదకరమైన సంక్లిష్టమైన సమస్య. ఇది సరఫరా గొలుసు సవాళ్లకు మాత్రమే పరిమితం కాకుండా బహుళ కారణాలతో ప్రభావితమవుతుం ది. అస్థిరమైన మార్కెట్ ధరలు, అధిక ఇన్‌పుట్ ఖర్చులు, రుణం, బీమాకు సరిపడా ప్రాప్యత, నీటి కొరత, పంట వైఫల్యాలు, పరిమిత మార్కెట్ అవకాశాలు వంటి అనేక సవాళ్లను రైతులు ఎదుర్కొంటున్నా రు. ఈ సవాళ్లు, ఇతర సామాజిక, ఆర్థిక వ్యక్తిగత అంశాలతో కలిపి రైతు ఆత్మహత్యల బాధాకరమైన పరిస్థితికి దోహదపడ తాయి. సరఫరా గొలుసు రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుండగా, రైతు ఆత్మహత్యలు విస్తృత వ్యవస్థాగత సమస్య లు, వ్యక్తిగత పరిస్థితుల కలయిక నుండి ఉత్పన్నమవుతున్నాయి, వీటిని గుర్తించడం చాలా ముఖ్యం.
సంస్కరణలు అవసరం
రైతు ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడానికి వ్యవసాయ సంస్కరణలు, సామాజిక మద్దతు వ్యవస్థలు, మానసిక ఆరోగ్య అవగాహన, ఆర్థిక సహాయం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులతో సహా సమగ్రమైన బహుళ -డైమెన్షనల్ విధానాలు అవసరం. మెరుగైన మౌలిక సదు పాయాలు, మార్కెట్లకు ప్రాప్యత, సరసమైన ధరల విధానాలు, సమర్థవంతమైన లాజిస్టిక్స్ వంటి వ్యవసాయ సరఫరా గొలుసును మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు, రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను తగ్గించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు తక్షణమే మధ్యవర్తులు, బ్రోకర్లను, కమిషన్ ఏజెంట్లను పక్కన పెట్టాలి. ప్రభుత్వమే వేలం పాటను నిర్వహించాలి. కోల్డ్ స్టోరేజి యూనిట్లు, మార్కెట్ సౌకర్యం, వేర్ హౌస్ నిర్మాణం చేపట్టాలి. రైతులు ధాన్యం నిలువ చేసుకోవడానికి గోదాములు గిడ్డంగులు ఏర్పాటు చేయాలి.
డా. ముచ్చుకోట సురేష్ బాబు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బూటకపు మాటలు మాట్లాడుతూ ప్రభుత్వాలు వారి సంక్షేమం గురించి పట్టించుకోకుండా సంబరాలు జరుపుతున్నాయి. పాలకులు వారికి ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం పూర్తిగా విస్మరించారు. రైతుబీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, మంచి విత్తనం, యూరియా, కంపోస్ట్, డీఏపీ, ఫంగిసైడ్ ఎరువులు అందుబాటులో లేవు. గత దశాబ్ద కాలంగా కోల్ స్టోరేజ్ యూనిట్స్, ధాన్యం నిల్వ చేసుకోవడానికి వేర్‌హౌస్‌లు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దీనికితోడు అసమర్థ రవాణా వ్యవస్థ కారణంగా పెద్ద మొత్తంలో కూరగాయలు పొలాల్లో కుళ్లిపోతున్నాయి.