06-11-2025 08:16:25 PM
👉 కుభీర్ మండలం నిగ్వా గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన
👉 తీవ్రంగా గాయపడిన యువకుడు కదం గణేష్ పటేల్
👉 గాయపడి తీవ్ర రక్తస్రావం
👉 హుటాహుటిన భైంసా ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు
👉 కోతుల బెడదను నివారించాలని అటవీశాఖ అధికారులకు మొరపెట్టు కున్నా చర్యలు శూన్యమని గ్రామస్తుల మండిపాటు
కుభీర్ (విజయక్రాంతి): తన ఇంటి ముందు వాకిట్లో ఆరబోసుకున్న సోయా పంటను సాయంత్రం వేళలో వాటిని కుప్పగా చేస్తున్న తరుణంలో 8 నుండి 10 వరకు కోతులు ఒక్కసారిగా యువ రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నిగ్వా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అదే గ్రామానికి చెందిన యువరైతు కదం గణేష్ పటేల్ గురువారం ఉదయం తన ఇంటి ముందు వాకిట్లో సోయా పంటను ఆరబోశాడు. సాయంత్రం ఐదు గంటలకి వాటిని ఒక దగ్గరికి చేర్చే (కుప్ప) క్రమంలో ఇంట్లో పిల్లలు ఏడుస్తూ వేధిస్తున్నారని గమనించిన ఆయన వారికి కొట్టుకు వెళ్లి కొనిద్దామనుకుని కుప్పచేయడం ఆపేసి ఇంట్లోకి వెళుతున్న క్రమంలో ఒక్కసారిగా ఎనిమిది పది కోతులు ఆయనపై పడి దాడి చేశాయి.
అరుపులు కేకలు వేస్తున్నప్పటికీ అవి ఆయనను కిందపడేసి తీవ్రంగా కరిచాయి. ఇరుగుపొరుగువారు గమనించి పెద్దగా అరుస్తూ కేకలు వేసి కర్రలతో విసరడంతో పరుగులు తీశాయి. దీంతో ఆయనకు వీపులో పెద్ద గాయం అయింది. లోపలి వెన్నెముక కనిపించడంతో కుటుంబీకులు గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. శరీరంలో పలుభాగాలపై గాయాలు కాగా ఆయనను వెంటనే బైంసాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొన్నేళ్లుగా కోతులు చిన్నపిల్లలు, మహిళలు, యువకులపై ఎందరినో గాయపరిచినప్పటికీ ప్రభుత్వ చర్యలు శూన్యంగా మారాయి. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో రెండు మార్లు అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని బోనులో కోతులను బంధించి నిర్మల్ లోని కోతుల పునరావాస కేంద్రానికి తరలించారు. రెండేళ్లుగా గ్రామస్తులు పలుమార్లు ఆ శాఖ అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన బాధితుడికి నష్టపరిహారం అందించి తమ గ్రామం నుండి కోతులను పునరావాస కేంద్రానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.