06-11-2025 10:18:03 PM
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తూ ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. నాగోల్ డివిజన్ ఎరుకల నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం రైతు బజార్ వద్ద డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు గురువారం మధుయాష్కీగౌడ్ ని కలిశారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులను త్వరగా చేపట్టాలని కోరారు. చాలా ఏళ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్నామని ఇళ్లు కేటాయించి తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మధుయాష్కీగౌడ్ జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మధుయాష్కి గారు మాట్లాడుతూ.. లబ్ధిదారులుగా ఎంపికైన వారికి త్వరలోనే ఇళ్ల కేటాయింపు చేసేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, ఉచిత కరెంటు, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. త్వరలో జిహెచ్ఎంసి ప్రాంతంలోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు వివరించారు. ఇళ్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాగోల్ డివిజన్ అధ్యక్షురాలు మంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.