calender_icon.png 6 November, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతుకుల రోడ్లు

06-11-2025 10:05:34 PM

* బోల్తా కొడుతున్న వరి ధాన్యం లోడ్ ట్రాక్టర్లు 

* రేకొండ, ముల్కనూర్ లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ల బోల్తా...

* త్రుటిలో తప్పిన పెనుప్రమాదం..

చిగురుమామిడి (విజయక్రాంతి): తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి అద్వానంగా తయారయింది. గ్రామాల్లో రైతులు పండించిన వరి పంటను ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు తరలిస్తున్న తరుణంలో ట్రాక్టర్ల డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ట్రాక్టర్ల డ్రైవర్లు మిల్లులకు వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఇటీవల మండలంలోని రేకొండ గ్రామంలోని మత్తడి వద్ద వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. చిన్న మూల్కనూర్ గ్రామంలో వరి ధాన్యం లోడ్ చేసుకొని రోడ్ ఎక్కుతుండగా ట్రాక్టర్ డబ్బా ధాన్యం బస్తాలతో సహా బోల్తా కొట్టింది. రోడ్డుపై ఎవరు లేకపోవడంతో ఇక్కడ కూడా ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు.

ఓగులాపూర్ గ్రామం నుండి వరి ధాన్యం లోడు వేసుకొని వస్తున్న ట్రాక్టర్ గాగిరెడ్డిపల్లె సంగోజుపేట చెరువు మత్తడి వద్ద కుప్పకూలింది. ఇలాంటి సంఘటనలతో ట్రాక్టర్ డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరుస వర్షాలతో రోడ్లు దెబ్బతిని అక్కడక్కడ ట్రాక్టర్లు దిగబడడంతో పాటు, బోల్తా కొడుతున్నాయి.వరి ధాన్యం లోడుతో వెళ్లే ట్రాక్టర్ డ్రైవర్లు జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాల రద్దీతో రోడ్డు దిగేముందు, కొనుగోలు సెంటర్ల వద్ద నుండి రోడ్లు ఎక్కే సమయంలో నిర్లక్ష్యం వహించకుండా చాలా జాగ్రత్తగా మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని ప్రజలు కోరుతున్నారు. చిగురుమామిడి మండలం నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో మిల్లులను అలాట్మెంట్ చేయడంతో ప్రధాన రహదారులపై భద్రంగా వెళ్లి రావాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల రేణికుంట సమీపంలో ఆర్టీసీ బస్సు వరి ధాన్యం లోడుతో వెళ్తున్న టాక్టర్ ను ఢీకొట్టిన ఘటన తెలిసిందే. చిన్న చిన్న నిర్లక్ష్యాలతో ప్రమాదాలకు కారణం కాకూడదని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.