14-01-2026 02:48:23 AM
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్
ముషీరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): కోదాడకు చెందిన కర్ల రాజేష్ పోలీస్ లాకప్ డెత్ ఘటన పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ ను అరెస్టు చేసినప్పటి నుంచి గాంధీ ఆసుపత్రిలో మృతి చెందే వరకు ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. మంగళవారం కర్ల రాజేష్ పోస్టుమార్టంకు జ్యూడిషిల్ మెజిస్ట్రేట్ గా వ్యవహరించిన ముషీరాబాద్ తహసీల్దార్ రాణా ప్రతాప్ ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజేష్ మృతి వెయ్యి శాతం కోదాడ పోలీసులు చేసిన హత్య అని అన్నారు.
రాజేష్ ను అక్రమంగా నిర్భందించి చిత్రహింసలకు గురిచేయడం వల్లనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై చిలుకూరు ఎస్‌ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ, అప్పటి కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డిలే పూర్తి భాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఎస్పి నుంచి డిజీపి వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోస్టుమార్టం ప్రక్రియలో మెజిస్ట్రేట్ తహసీల్దార్ తన బాధ్యత లు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.
కోదాడ పోలీసులు రాజేష్ పోస్టు మార్టం నిర్వహించే సమయంలో డాక్టర్ల బృందాన్ని, వీడియో గ్రాఫర్ ను నియమించే విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం చట్టవిరుద్దమని అన్నారు. రాజేష్ అరెస్టు నుంచి మృతి చెందే వరకు వివిధ ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. అందుకోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు న్యాయ విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి అధికారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో అందోళనలు మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ మాదిగ మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు నరసింహారావు, సీనియర్ నాయకులు గండి కృష్ణ ముషీరాబాద్ నియోజ కవర్గం ఇన్చార్జీ, గజ్జెల రాజశేఖర్, దశరథ్, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.