23-02-2025 12:00:00 AM
ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. చిన్నప్పుడే పుస్తకాలు చదివే అలవాటు అబ్బితే అనేక రంగాల్లో రాణించగలుగుతారు. ఇతరుల కంటే చురుగ్గా ఆలోచించగలుగుతారు.పిల్లలకు అకడమిక్ పుస్తకాలే కాదు.. సక్సెస్ స్టోరీస్, కామిక్స్, హ్యూమరస్ లాంటి పుస్తకాలను పరిచయం చేయాలి. ఢిల్లీలోని బీసీ రాయ్ చిల్డ్రన్స్ రీడింగ్ రూమ్ అండ్ లైబ్రరీ ఇదే లక్ష్యంతో ఏర్పడింది. 70 వేలకుపైగా పుస్తకాలతో పిల్లల్లో విజ్ఞానం నింపుతోంది. ఈ లైబ్రరీ విశేషాలు మీకోసం..
ప్రముఖ పిల్లల పత్రిక శంకర్స్ వీక్లీని నడిపిన కార్టూనిస్ట్ కె. శంకర్ పిళ్ళై ఈ లైబ్రరీని ఏర్పాటు చేశారు. అప్పటి రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ దీన్ని ప్రారంభించారు. ఇందులో 70,000 పుస్తకాలున్నాయి.
ఈ లైబ్రరీలోని అన్ని పుస్తకాలు కేవలం చదవడానికి ఉద్దేశించినవి మాత్రమే కావు. జ్ఞానాన్ని అందించే ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జంతుశాస్త్రం లాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ లైబ్రరీకి వెళ్లి నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. కావాలంటే ఆ పుస్తకాలు ఇంటికి తీసుకురావచ్చు. అవి చదవడం పూర్తయ్యాక తిరిగి ఇచ్చి, మరో పుస్తకం తీసుకోవచ్చు.
ఇందులో వివిధ భాషల పుస్తకాలున్నాయి. అవన్నీ చిన్నారుల్లో విజ్ఞానాన్ని, దేశభక్తిని, సామాజిక అవగాహనను పెంచుతాయి. ఇక్కడున్న పుస్తకాలను ’గ్రూప్ ఏ’, ’గ్రూప్ బి’, ’గ్రూప్ సి’ అని మూడు భాగాలుగా విభజించారు. ’గ్రూప్ ఏ’లో ఎనిమిదేళ్ళ లోపు పిల్లలు చదివే పుస్తకాలుంటాయి. ’గ్రూప్ బి’లో తొమ్మిదేళ్ల నుంచి పన్నెండేళ్ళ పిల్లలు చదివే పుస్తకాలుంటాయి.
’గ్రూప్ సి’లో పదమూడు’ నుంచి పదిహేడేళ్ల వయసున్నవారు చదివే పుస్తకాలుంటాయి. బడికి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఈ లైబ్రరీలో మెంబర్‌గా చేరొచ్చు. ఇందుకు రూ.50 అడ్మిషన్ ఫీజుతోపాటు ఏడాదికి రూ.150 ఫీజు ఉంటుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.500 కట్టించుకుంటారు. ఇక్కడికి చిన్నారుల వెంట పెద్దలు కూడా రావొచ్చు. అయితే పుస్తకాలు తీసుకునే అవకాశం మాత్రం కేవలం పిల్లలకే ఉంటుంది.
ఒక సారి రెండు పుస్తకాలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లాలి. వాటిని రెండు వారాలలోగా చదివి, తిరిగి ఇచ్చేయాలి. ఒకేసారి రెండు కంటే ఎక్కువ పుస్తకాలు కావాలంటే ఏడాది ఫీజు మరికొంత ఎక్కువ కట్టాల్సి ఉంటుంది.
లేదంటే అక్కడే కూర్చుని మీకు నచ్చిన పుస్తకాలు ఎంతసేపైనా చదువుకోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ లైబ్రరీకి ఒక్కసారైనా పరిచయం చేయాలనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఢిల్లి వెళ్లితే.. ఈ ల్రైబరీని విజిట్ చేయడం మరువకండి.