19-11-2025 08:37:26 PM
సిద్దిపేట క్రైం : మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి న్యాయమూర్తి రూ.అరవై వేల ఐదు వందలు జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని పలు చౌరస్తాలు, రాజీవ్ రహదారిపై సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయగా, ఆరుగురు మద్యం తాగి నడుపుతుండగా పట్టుకున్నట్టు చెప్పారు. వారిని బుధవారం సిద్దిపేట ఒకటవ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఎదుట హాజరుపరచగా, జరిమానా విధించారని తెలిపారు.
ఒకరికి రెండు రోజుల జైలు
సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేయగా, పుల్లూరి మల్లయ్య అనే వ్యక్తి మద్యం తాగి వాహనము నడుపుతూ పట్టుపడ్డాడని ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. బుధవారం అతడిని న్యాయమూర్తి తరణి ఎదుట హాజరుపరచగా, రెండు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు.