calender_icon.png 16 December, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ’ స్థానంలో.. ‘వీబీ- జీ రామ్ జీ’ కొత్త చట్టం

16-12-2025 01:23:18 AM

లోక్‌సభ అనుబంధ కార్యకలాపాల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం

‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్’ పేరిట బిల్లు

బిల్లుపై భగ్గుమన్న విపక్షాలు.. గాంధీ పేరు మార్పుపై తీవ్రమైన అభ్యంతరాలు

  1. పేరు మార్పు వల్ల రూ.కోట్ల ప్రజాధనం వృథా: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక
  2. పథకంపై హఠాత్తుగా ప్రేమ ఎందుకు?: కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక 
  3. గాంధీని చరిత్ర పుటల్లో తొలగించే కుట్ర: టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్
  4. పాత చట్టాలను సవరించేందుకే కొత్త చట్టం: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రెండు దశాబ్దాలుగా అమలవుతున్న ఆ చట్టాన్ని రద్దు చేసేందుకు, దాని స్థానంలో శీతాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభ అనుబంధ కార్యకలాపాల జాబితా (సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ బిజినెస్’లో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (వీబీ- జీ రామ్ జీ) చట్టాన్ని ప్రవేశపెట్టింది.

‘వికసిత్ భారత్ 2047’లో భాగం గా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన జీవనోపాధులు కల్పించేలా కొత్త చట్టం దోహదం చేస్తుందని కేంద్రం చెప్తోంది. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఉపాధి కూలీకి ఏడాదిలో 125 రోజులు ఉపాధి కల్పించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొంది. నిన్న మొన్నటివరకు 100 రోజులు ఉన్న పనిదినాలను మరో 25 రోజులు పెంచుతున్నదని తెలిపింది.

కొత్త చట్టం ద్వారా జాబు కార్డుదారులకు మెరుగైన ఉపాధి దొరకడమే కాకుండా, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకూ పనులు ఉపయోగపడతాయని స్పష్టం చేసింది. కొత్త చట్టంలో నాలుగు కీలకమైన పనులకు ప్రాధాన్యం ఉంటుంది. జల వనరుల నిర్వహణ, సంరక్షణ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధుల పెంపు, పర్యావరణ పరిరక్షణకు జీ రామ్ జీ చట్టం ప్రాధాన్యత ఇస్తుందని కేంద్రం పేర్కొం ది.

పాత చట్టంలోని లోపాలను సరిదిద్దేందుకే కొత్త చట్టం తీసుకు వస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. మునుపటి పథకంలో నిధుల కేటాయింపు అస్తవ్యస్తంగా ఉండేదని, కానీ.. కొత్త చట్టంలో నిర్దేశిత నిబంధనల ప్రకారమే నిధులు విడుదలవుతాయని పే ర్కొంది. కొత్త చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపాధి పనులకు సంబంధించిన పనులను సులువుగా చేపట్టేందుకు వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది.

ఒకవేళ జాబుకార్డు దారులకు ఏడాదిలో 125 రోజుల పాటు పనిదినాలు కల్పించకపోతే, మిగిలి రోజులకూ భృతి చెల్లించే విధంగా చట్టానికి రూపకల్పన చేశామని తెలిపింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువ స్తామని, అదేవిధంగా జీపీఎస్, రియల్ టైం డాష్‌బోర్డ్ వ్యవస్థలనూ ఏర్పాటు చేస్తామని వివరి ంచింది.  వాటివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుందని భావిస్తోంది.మరోవైపు ఈ చట్టంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాయి.

రెండు కీలక బిల్లులు

పార్లమెంట్ శీతాకల సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లు, మరొకటి ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు. ఈ రెండు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపే అవకాశం ఉంది. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే కేంద్రం ఆ రకమైన బిల్లు ప్రవేశపెట్టిందని ఆరోపించారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ఒకే గొడుగు కింద వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ (వీబీసీఏ ) అనే కొత్త కమిషన్ కేంద్రం నిర్ణయించింది.

కొత్తగా సంస్కరణలు తీసుకొస్తున్నాం..

ఉపాధి పథకం రెండు దశాబ్దాల నుంచి గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన ఉపాధి కల్పిస్తున్నది. కరువు సమయాలు, ఉపాధి దొరకని సమయాల్లో వారిని పథకం ఆదుకున్నది. ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం అనేక లోపాలను గమనించింది. వాటిని సవరించి, కొత్త సంస్కరణలు తీసుకొచ్చి చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే వీబీP జీ రామ్ జీ చట్టానికి శ్రీకారం చుట్టింది. తాము ప్రవేశపెట్టే చట్టం గ్రామీణ ప్రాంత ప్రజలను ఆర్థిక స్థితిగతులను మార్చే విధంగా ఉంటుంది. ఉపాధి పథకం మరింత పటిష్టంగా మారుతుంది.

 శివరాజ్ సింగ్ చౌహాన్, 

కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి 

గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు?

ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు? మహాత్మా గాంధీ కేవలం ఒక్క భారత్‌కు చెందిన నేత కాదు. యావత్ ప్రపంచానికే ఆయన గొప్ప నాయకుడు. ఆయన పేరును తొలగించడం వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. పేరు మార్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? కేవలం పేరు మార్పు వల్ల కోట్ల రూపాయల ప్రజాధానం వృథా అవుతుంది. కార్యాలయాలు, అధికారిక రశీదులు, స్టేషనరీ.. ఇలా అన్నింటిపై పేరు మార్పు చేయాలి. అన్ని వృథా ఖర్చులెందుకు?

 ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

గాంధీపై ద్వేషంతోనే..

జాతిపిత మహాత్మా గాంధీపై ద్వేషంతోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకానికి ఆయన పేరును తొలగిస్తున్నది. నోటిలో పలకడానికి కూడా కష్టమైన ఉత్తరాది భాషను యావత్ దేశానికి రుద్దడం సరైన పద్ధతి కాదు. కొత్త బిల్లు వల్ల కేంద్రం వాటా 100 శాతం నుంచి 60 శాతానికి తగ్గుతుంది. దేశంలోని నిరుపేదలకు ఉపాధినిచ్చిన పథకాన్ని కేంద్రం నాశనం చేయాలని సంకల్పించి పథకాన్ని మార్చింది.

 ‘ఎక్స్’ ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

గాంధీకి జరిగిన అవమానమిది !

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక సాధారణ నిర్ణయం కాదు. ఇది మహాత్మా గాంధీకి చేసిన అవమానం. గాంధీని చంపిన గాడ్సేను బీజేపీ, ఆర్‌ఎస్ నేతలు ఆరాధిస్తున్నారు. గాంధీని చరిత్ర పుటల నుంచి తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. దీనిలో భాగంగానే ఉపాధి పథకం పేరు మార్పు.

 డెరెక్ ఓ బ్రియన్, 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ 

హఠాత్తుగా ఎందుకు ప్రేమ?

కేంద్ర ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాబట్టే దానిని రద్దు చేయాలని చూస్తున్నది. పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసేయడం దుర్మార్గం. ఒకప్పుడు మోదీ ఈ పథకాన్ని కేవలం గుంతలు తవ్వే కార్యక్రమం అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు.. హఠాత్తుగా ఆయనకు పథకంపై ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది. పేరు మార్చాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

 సప్తగిరి ఉలక, కాంగ్రెస్ ఎంపీ

రాష్ట్రాలపై ఆర్థిక భారం వేయాలనే..

కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం రా ష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తున్నది. ఉపాధి పథ కానికి సంబంధించిన ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై నెట్టివేయాలని చూస్తున్నది. ము ఖ్యం గా ప్రతిపక్ష, ప్రాంతీయ పా ర్టీల పాలనలో ఉన్న రా ష్ట్రాల ఖజానాకు గండి కొట్టాలనే కేంద్రం ఈ నిర్ణ యం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీ ఎం వ్యతిరేకిస్తున్నది. ఆ నిర్ణ యం వెనక్కి తీసుకునే వర కూ మా పార్టీ పోరాడుతుంది.

 ‘ఎక్స్’ ద్వారా బేబీ,

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి