- కుప్పకూలిన అంతర్జాతీయ మార్కెట్లు
- యూఎస్, చైనా వృద్ధి మందగిస్తుందన్న భయాలు
ముంబై, సెప్టెంబర్ 4: వరుస రికార్డులతో అదరగొట్టిన దేశీయ ప్రధాన సూచీల్లో ఒకటైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పరుగుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ పతనంకావడంతో భారత సూచీలు సైతం బుధ వారం క్షీణించాయి. వరుస 10 రోజుల ర్యాలీకి మంగళవారమే బ్రేక్‌వేసిన సెన్సెక్స్ తాజాగా మరింత పడిపోయింది. గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన సెన్సెక్స్ ట్రేడింగ్ తొలి దశలో 700 పాయింట్లకుపైగా 81,833 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది.
తదుపరి ఎఫ్‌ఎంసీజీ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కొంత కోలుకున్నప్పటికీ, తుదకు 202 పాయింటు కోల్పోయి 82,353 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో నిఫ్టీ ట్రేడింగ్ ప్రారం భంలో 196 పాయింట్లు తగ్గి 25,083 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది.చివరకు 81 పాయింట్ల క్షీణతతో 25,198 పాయింట్ల కొత్త వద్ద ముగిసింది. నిఫ్టీ గత 14 రోజుల్లో 1,141 పాయింట్లు ర్యాలీ జరిపింది.
ఒకవైపు మెటల్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ, మరోవైపు ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని ట్రేడర్లు తెలిపారు. మంగళవారం రాత్రి అమెరికా స్టాక్ సూచీలు 2.5 శాతం పతనంకాగా, బుధవారం ఆసియాలో టోక్యో, సియోల్, షాంఘై, హాంకాంగ్ సూచీ లు భారీ నష్టంతో ముగిసాయి. యూరప్ సూచీలు సైతం నష్టాల పాలయ్యాయి.
ఇన్వెస్టర్లకు హెచ్చరిక సంకేతాలు
తాజాగా వెలువడిన యూఎస్ పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తయారీ డేటా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న సంకేతాలను ఇస్తున్నదని, మరోవైపు చైనా తయారీ రంగం కూడా బలహీనడిందన్న గణాంకాలు వెలువడుతున్నాయని, ఇవి ఇన్వెస్టర్లకు ముందస్తు హెచ్చరికల వంటివని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
బలహీన అంతర్జాతీయ సంకేతాల కారణంగా భారత్ మార్కెట్లు లాభాల ట్రెండ్‌ను ముగించాయ ని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. అయితే కొన్ని హెవీవెయిట్ షేర్లలో జరిగిన కొనుగోళ్లతో ము గింపు సమయంలో నష్టాలు తగ్గాయన్నారు.
ఎం అండ్ ఎం టాప్ లూజర్
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 1.3 శాతం క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, లార్స న్ అండ్ టుబ్రో, టాటా స్టీల్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు 1 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా మెటల్ ఇండెక్స్ 1.11 శాతం తగ్గింది. ఐటీ ఇండెక్స్ 0.91 శాతం, టెలికమ్యునికేషన్ ఇండెక్స్ 0.82 శాతం, టెక్నాలజీ ఇండెక్స్ 0.71 శాతం, బ్యాంకెక్స్ 0.70 శాతం చొప్పున తగ్గాయి. హెల్త్‌కేర్, కమోడిటీస్, రియల్టీ, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండె క్స్‌లు పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండె క్స్ 0.15 శాతం తగ్గగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం పెరిగింది.
5 రోజుల్లో రూ.12,000 కోట్లు
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
కొద్ది రోజులపాటు వరుస విక్రయాలకు పాల్పడిన విదేశీ పోర్ట్‌ఫో లియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి పెద్ద ఎత్తున భారత్ మార్కెట్లో నిధు లు కుమ్మరిస్తున్నారు. వరుసగా వీరు 5 రోజుల్లో రూ.12,000 కోట్లకుపైగా షేర్లను నికరంగా కొను గోలు చేశారు. గత గురు, శుక్రవారాల్లో రూ. 3,260 కోట్లు, రూ. 5,318 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌పీఐలు సోమ, మంగళవారాల్లో రూ.2,730 కోట్ల షేర్లను కొన్నారు. బుధవారం మరో రూ. 975 కోట్లు నికర పెట్టుబడి చేసిన ట్టు తాజా స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.