calender_icon.png 5 November, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి..

05-11-2025 12:47:52 AM

-విద్యార్థుల ఫీజులు కట్టని సర్కార్.. జూబ్లీహిల్స్‌ను ఎలా అభివృద్ధి చేస్తుంది?

-పొంగులేటి, వివేక్ ఇండ్లకు హైడ్రా ఎందుకు వెళ్లదు?

-జూబ్లీహిల్స్‌లో కారుకు, బుల్డోజర్‌కు మధ్య పోటీ

-సోమాజిగూడ రోడ్ షోలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): అభివృద్ధి, సంక్షేమం అం టూ అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని సర్కార్.. జూబ్లీహిల్స్‌ను ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమాజిగూడలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరికీ అన్నం పెట్టే నగరం హైదరాబాద్. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ నగరంలో ప్రతి ఇంట్లో, ప్రతి షాపులో ఇన్వర్టర్లు ఉండేవి. వేసవి వచ్చిందంటే తాగునీటికి కటకటలాడే పరిస్థితి. కేసీఆర్ రాష్ట్రాన్ని చంటిబిడ్డలా చూసుకొని, కరెంట్ కష్టాలు, తాగునీటి సమస్యలు తీర్చారు. కొత్త ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలతో 3 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగాలను 10 లక్షలకు తీసుకెళ్లాం.

రియల్ ఎస్టేట్, ఓలా, ఉబర్, జొమాటో వంటి గిగ్ వర్కర్లకు వేలాదిగా ఉపాధి అవకాశాలు కల్పించి, శాంతిభద్రతలు కాపాడుతూ అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేశాం” అని గుర్తుచేశారు. “అభివృద్ధిలో, సంక్షేమంలో మాతో పోటీపడలేక, అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అత్తలకు రూ.4 వేలు, కోడళ్లకు రూ.2,500, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, తులం బంగారం, యువతులకు స్కూటీలు, రైతులకు రూ.15 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ, రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి... ఇలా 420 హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చకుండా ప్రతి వర్గాన్ని మోసం చేసింది” అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ప్రచారం 

కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే ఉద్యోగాలు వస్తాయని రాహుల్‌గాంధీ చెపితే నమ్మిన విద్యార్థులే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. “వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పక్కనపెట్టి, విద్యాసంస్థలకు రూ.10 వేల కోట్లు బకాయిపడ్డారు. బకాయిలు అడిగితే కాలేజీలను మూయిస్తామని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. పీఆర్సీ ఇవ్వక ఉద్యోగులను, బకాయిలు చెల్లించక పెన్షనర్లను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

వారి గుండెలు ఆగిపోతున్నా సీఎం రేవంత్‌రెడ్డి గుండె కరగడం లేదు” అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నడుపుతున్నది సర్కారా లేక బెదిరింపుల దర్బారా అర్థం కావడం లేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. రియల్ ఎస్టేట్‌ను నాశనం చేశారు. ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా హైడ్రా భూతంతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ హైడ్రా కేవలం పేదల ఇళ్లకేనా? మంత్రులు పొంగులేటి, వివేక్ ఇళ్లకు వెళ్లదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. ఈ బుల్డోజర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలంటే, దానికి అడ్డొచ్చే కారు గుర్తుకే ఓటేయాలి, అని పిలుపునిచ్చారు.