calender_icon.png 5 November, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుల గోస

05-11-2025 12:44:54 AM

రంగుమారుతున్న తెల్లబంగారం 

-వర్షాలకు పగిలిన పత్తిలో నీరు చేరి మొలకెత్తుతున్న వైనం

-సగానికి తగ్గనున్న దిగుబడి

-సరిపడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవక ఇబ్బందులు  

-దళారులను ఆశ్రయిస్తున్న రైతులు

-సర్కార్ ఆంక్షలపై రైతుల ఆగ్రహం

-సీసీఐ కేంద్రాల్లో ఎకరానికి 12క్వింటాళ్లు కొనాలని డిమాండ్  

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి) :  ఆరుగాలం కష్టపడుతున్న రైతుకు పంట చేతికొస్తుందన్న నమ్మకం సన్నగిల్లుతోంది. కర్షకులను ప్రతి ఏటా అతివృష్టి, అనావృష్టితో  కష్టాలు, నష్టాలు వెంటాడూతూనే ఉన్నాయి. ఇక పత్తి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పత్తి విత్తినప్పటి నుంచి చేతికొచ్చే దాకా వర్షాలు వెంటాడుతున్నాయి. కొద్దోగొప్పో చేతికొచ్చిన పంటను అమ్ముకునేం దుకు కష్టాలు పడాల్సి వస్తుంది. 

రాష్ట్ర వ్యా ప్తంగా 45,04,685 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. వర్షాధార పరిస్థితుల వల్ల వేసిన పత్తి విత్తనాలు మొదట మొలకెత్తలేదు. ఆ తర్వాత పడిన వర్షాలతో విత్తనాలు మొలకెత్తి.. కాత రావడంతో రైతుల్లో కొంత మేర ఆశ చిగురించినా.. అంతలోనే  భారీ వర్షాలు, వరదల వల్ల కాత, పూత దెబ్బతిన్నది.   పత్తి వానలకు రంగుమారుతున్నది. పగిలిన పత్తిలో నీరు చేరి గింజలు మొలకెత్తడంతో రైతుకు తీవ్ర నష్టం జరుగుతోంది. 

తగ్గిన దిగుబడి

అనుకున్న సమయానికి వానలు పడి కాలం మంచిగైతే.. నల్లరేగడి భూమిలో ఒక్కో పత్తి చెట్టుకు 80 నుంచి 90 కాయల వరకు కాస్తాయి. అదే దుబ్బ, ఎర్రనేలల్లో అయితే 60 నుంచి 70 కాయలు కాస్తాయి.  కానీ, ఈసారి జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెల్లలో కురిసిన వానలకు పత్తి దిగుబడి బాగా తగ్గింది. ఒక్కొక్క చెట్టుకు సగటున 50 నుంచి 60 కాయలకు మించి కాయలేదు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు పొలాల్లో నీరు చేరడంతో పత్తి కాయలకు నీర్చిచ్చు వచ్చి మొక్కలు చనిపోయాయి. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుంది. కానీ, ప్రస్తుత  పరిస్థితుల్లో ఎకరాకు ఐదు నుంచి ఏడు క్వి ంటాళ్ల పత్తి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎకరాకు నాలుగు క్వింటాళ్లు వస్తుంది. వీటన్నింటి ఫలితంగా పత్తి ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది. రైతుకు  పెట్టుబడి ఖర్చులు పోను.. మిగిలేది ఏమి లేకుండా పోతుంది. ఇక పత్తిచేతికొచ్చిన తర్వాత తడి కారణంగా పత్తి నాణ్యత తగ్గి నల్లగా మారడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

ఎకరానికి 12 క్వింటాళ్లు కొనాలి

పత్తి కొనుగోలు విషయంలో  కాటన్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) పెడుతున్న నిబంధనలు రైతులను కలవరపెడుతున్నాయి. పత్తిలో 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతు ండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక వేళ ఎక్కడో ఒక చోటు పత్తి దిగుబడి ఎక్కువగా ఉంటే.. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టడటంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎకరానికి ఏడు కాదు 12 క్వింటాళ్లు కొనాలని రైతులు పట్టుపడుతున్నారు. వికారాబాద్ జిల్లాలోని రైతులు జిన్నింగ్ మిల్లులకు 15లోడ్ల పత్తిని తీసుకెళ్లగా, వాటిలో కేవలం 2 లోడ్లకే తేమ శాతం సరిపోగా, మిగతా పత్తిని తిరిగి పంపించేశారు. ఒక్క లోడ్ పత్తి తీసుకురావానికి రవాణా, కూలీలకు రూ. 6 వేల వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. 

వెంటాడుతున్న యాప్ కష్టాలు  

అసలే కష్టాల్లో ఉన్న రైతులకు కపాస్ కిసాన్ యాప్‌తో మరిన్ని కష్టాలు వచ్చిపడుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల  రైతులు గందరగోళానికి గురవుతున్నారు. క్రాప్ బుకింగ్ సమయంలో చిన్న తప్పు జరిగితే.. ఆ వివరాలు యాప్‌లో కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. మార్కెట్ వచ్చినప్పుడు కూలీలు దొరకకపోవడం వల్ల కూడా అన్‌లోడు చేయడానికి ఆలస్యమవుతోంది. పత్తిలో తేమ శాతం 20వరకు ఉన్నా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. మంత్రి తుమ్మల లేఖలు కూడా రాశారు. కానీ కేం ద్రం నుంచి సమాధానం రావడం లేదు. అయితే అప్పటి  వరకు వేచి చూస్తే రైతుల పరిస్థితి దయనీయంగా మారే పరిస్థితి నెలకొన్నది.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అయితే సీసీఐ కేం ద్రాలు సకాలంలో ప్రారంభించడం ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీఐ తమ కేంద్రాలను అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి తెరవడంతో దళారులు రంగంలోకి దిగుతున్నారు. పంటను దాచుకోలేక, మార్కెట్‌కు తీసుకుపోలేక పత్తి రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేట్ వ్యాపారులు  తేమ అధికంగా ఉందని, నాణ్యత లేదంటూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ.8,100 రైతులకు చెల్లించాలి. కానీ, మార్కెట్లో మాత్రం క్వింటాకు రూ. 6,500లకు మించి  ఇవ్వడం లేదు. జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ఎంతకో అంతకు అమ్ముకుంటున్నారు.

పత్తి రైతుకు బోనస్ ఇవ్వాలి 

పత్తికి కూడా క్వింటాకు రూ. 475 బోన స్ ఇవ్వాలి.  దళారుల వద్దకు పత్తి రైతులు వెళ్లకుండా ఉండాలంటే.. పూర్తి స్థాయిలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. జిన్నింగ్ మిల్లులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని.. జిన్నింగ్ చేసిన పత్తిని సీసీఐకి అమ్ముతూ లాభాలు గడిస్తున్నా రు. ఈ అక్రమ వ్యాపారుల లాభాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సీసీఐ కొనుగోలు చేసిన పత్తి ని జిన్నింగ్ మిల్లులకు రైతులతోనే రవాణా చేయించడం, పత్తి తెచ్చిన బస్తాలకు కనీసం డబ్బులు ఇవ్వడం లేదు. శాంపిల్స్ పేరిట జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. 

 భూక్యా చందూనాయక్ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్, 

నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేయాలి 

అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వం నమోదు చేయాలి. వారికి పరిహారం ఇవ్వాలి. 20 శాతం తేమ వరకు కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలి. కపాస్ కిసాన్ యాప్ ఎలా వాడాలో అధికారులే గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిం చాలి. యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత అధికారులే తీసుకోవాలి. కౌలు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కల్పించాలి. 

 కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ భ్యులు