calender_icon.png 22 July, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత జ్ఞాపకాల థిల్లానా !

21-07-2025 12:00:00 AM

సికింద్రాబాద్ స్టేషన్, రాణీగంజ్, మింట్, పబ్లిక్ గార్డెన్సు, నాంపల్లి, కింగ్ కోఠి, మూసీ, చార్మినార్. ఒకటి తర్వా త ఒకటి వెనక్కు వెళ్లేయి. దిగాను. గతించి న వత్సరాల మరువు నెమరుస్తూనే ఆ గల్లీలో ఇళ్లు వెతుక్కుంటున్నా. వానకు తడిసిన రోడ్లు నిగూఢ చిత్రకారుల్లా లాల్చీ మీద రంగులు వేస్తున్నాయి. నడుస్తున్నా ఈ మరుపురాని ఇళ్లలోని తెరలు తీయనిస్తే, ఇం ట్లో స్తంభాల్ని మనుష్యుల్ని లెక్కపెట్టి బుగ్గల్లో నిద్రపోయి వుందును. కానీ రానియ్యరు. ఎగిరేలాల్చీ తోమిన బిందెల్లో, తడిసిన కబరీ భారపు పువ్వుల్లో అద్దకాల ఛోళీల్లో, అందం చూసుకుంటానంటోంది.

“దాదా!” ఎవరో పిలుస్తున్నారు. ఉలిక్కిపడ్డా, గత పది సంవత్సరాల నుంచీ నెని క్కడికి రానేలేదు. ఎవరు పిలుస్తారు? ఆలోచన, గుర్తుకు రాని మరువుతో ఎవరివైపు చూస్తే, ఎవరేమనుకుంటారో అన్న సిగ్గు, భయం, వల్లెవాటు వేసింది.“జహంగీర్ దాదా!” మళ్లీ అదే స్వరం వీణమెట్ల ఆరోహ ణ. నెరసిన గడ్డంలో పడ్డ చినుకు లు చంపలూడిన ముతైదువ, సిగలోని పువ్వుల్లా “నిన్నెవరు వరిస్తారు?” అంటున్నాయి.

యవ్వనంలో కౌగిలించుకున్న వెచ్చదనం తోక చుక్క అయింది చూసే.విరిగిన జాల కర్రల్లోంచి, వోణీ వేసుకున్న నడుం నవ్వుతోంది. కళ్లు పిలుస్తున్నాయి. కాటికల్లోంచి, గడ్డం మీద రత్నాల్ని, ఎర్రగళ్ల రుమాల్తో తుడుచుకునే చార్మినార్ మెలామాలో అద్దం చూసుకునే అటు అడుగులు వేశాను.

“జ్ఞాపకం ఉన్నానా? జహంగీర్ దాదా?”

జ్ఞాపకం! నెమ్మదిగా పైనున్న మబ్బుల్లాగే పదేళ్లు ! ఈ ఇల్లు, పరిసరాలు, తెలిసివున్న వ్యక్తులు స్ఫురించటం లేదు. వ్యక్తావ్యక్తంలో ఆ అమ్మాయిని చూసినట్టే వుంది. మాట్లాడినట్టే తడుతోంది. అయినా? “జ్ఞాపకంలేకేం” “అన్నా, అమ్మా, నాన్నా కులాసాగా ఉన్నా రా?” వయసులోని అనుభవం సమయోచితంగానే కుశల ప్రశ్న వేయించింది.

కళ్లల్లోకి చూస్తున్న అమ్మాయి కనుపొట్ట లు నవ్వుతున్నాయి. చిల్లిచెంబులో కాళ్లు కడుక్కున్నా, ఎంతగా ఆలోచించినా, ఇంత బీదరికంలో ఉన్న స్నేహితులు. ఎవరూ లేరే’ అని మనసు ఎత్తి పొడుస్తోంది.

మాసిన తువ్వాలు ఇచ్చిందా అమ్మాయి “దాదా! చిన్నప్పుడు నన్నేమని పిల్చేవాడివో జ్ఞాపకం వుందా?”

సబ్బు బుడగ పేలిపోయింది. ‘ముసలివాణ్ణి అయ్యేనా;’ ఏం జ్ఞాపకం.

“నాన్న నన్ను రమా అనే పిలిస్తే నువ్వు కోప్పడే వాడివి. ఆఖరుకు నాన్న “మోతీ, అని పిల్చేవరకూ ఒదిలే వాడికి కాదు...” ఇం కా చెబుతూనే వుంది. మోతీ! ఎవరూ? శివరాజ్ -కూతురా? అప్పుడు ఆ చదువుకునే రోజుల్లో రోజూ దగ్గరకు వచ్చి జేబులన్నీ తడిమి తనకు పిప్పరమెంట్లు తెచ్చానో లేదో అని వెతికే ఇన్‌స్పెక్టరా? కల కాదు కదా?

ఎంత త్వరగా గడచిపోయాయి, ఈ లోపుగా పెళ్లి వద్దన్న వాడిని పెళ్లి చేసుకోవ డం, ప్రసవించలేక ఒక్కణ్ణి నాకిచ్చి, అల్లా దగ్గరికి బేగం వెళ్లడం.. ఈ విధుర జీవితంలోని ఏకాకితత్వం... అన్నీను. శివ్ మళ్ళీ కనిపించనేలేదు. అప్పుడు శివ్ వున్న ఇల్లు, ఇప్పుడు తాళం వేసి, అర్ధంకాని చార్మినార్ని గూడాల్లాగే వుండడంతో దిగనారేనడిచే కాని ఇప్పుడు...

తలుపుమీద తువ్వాలు వేస్తూనే “మోతీ! పిప్పర మెంట్లు ఉన్నయ్యే మో జేబులు వెతుకూ” అన్నా. పొట్టవిడిన పువ్వులా నవ్వింది. బుగ్గల్లోని సొట్టలు చిత్రకారుని కుంచెల్ని జ్ఞాపకం తెస్తోంది. సౌందర్య పిపాసచావలేక, అందాల్ని ఆరాధి స్తూ లోపల్కి అడుగులువేసే వయస్సుల్లోని జనానాలు ఈర్ష్యల్తో కువకువమన్నాయి.

“నాన్నా! పాదుషా వచ్చాడు నాన్నా”

“ఎవరూ?”

“పాదుషా!””

“జహంగీర్‌” ఆశ్చర్యంలో ప్రతిధ్వని చవుడోడిన ఇటికల మధ్య వూగింది.

“ఆవున్నాన్నా” అమ్మాయి నావైపు తిరిగి నవ్వుతోంది.

గదిలో ఉన్న శివ నమ్మలేకుండా ఉన్నా డు. ఇన్ని వత్సరాలు దాటినా కంఠంలోని మార్దవాన్ని మార్చుకోనేలేదు. నరికిన చెట్టు చిగురుస్తున్నట్టే ఇరువురి జీవితాలు నెమరుకు వస్తున్నాయి. నాటి అల్లర్లు, చిలిపి చేష్ట లు,రౌడీతనం అన్నీను.అవి జరిగిపోయాయి.

“శివ్‌” దగ్గరగా వెళ్లే, నులక మంచం మీద పడుకుని సాలీళ్లని, గది మూలల చీకట్లని, చిమ్మెట్లని, బొద్దింకల్ని అడుక్కు తొయ్యడానికి సాయం అడుగుతున్నట్టే చూస్తున్నాడు.

“జహర్ భాయ్! దగ్గరగా రా! ఎన్నాళ్ళ కి?” ఇంక మాట్లాడలేక కళ్లెమ్మట నీళ్లెట్టుకున్నాడు. దగ్గరగా లేచి రాలేదేం” అన్న సంశ యం నన్ను ఊపుతోంది. వెనువెంటే వృద్ధా ప్యం అన్న జవాబు సముదాయిస్తోంది.

రెండు చేతులు పట్టుకున్నా, స్పర్శల్లోని మార్దవం, శివ చిత్రకళల్లోని వంపుల్ని, కళాదృష్టిని ఓనమాలు దిద్దిస్తోంది. నీళ్లు చిలి కాయి. నీటి పొరల మధ్య మోతీ ఢక్కా మజ్లివ్‌లను సవరించిం.. నిశ్శబ్దంలో ఆవేదన, ఆరాధనల్తో.

“ఆ తర్వాత ఇంకా చాలా చిత్రాలువేసే... రమా!”

“రమకాదు భాయ్! మోతీ అని పిలూ”

చిత్రాలు! పూర్వపు శివే! కళావేత్తల్లో ఒకడు అనిపించుకోవాల ని, నిద్రాహారాలు మాని, చదువు కు స్వస్తి చెప్పి, వేసిన ప్రతీ చిత్తరువును చూపిస్తూ, చరిత్రలు చెబుతూ.. అన్నీ అప్పటికే, ఈ ఇంటికి దూలాలు, వాసాలు ఒక్కసారి వేసినవే అనిపిస్తోంది.

నవ్వాడు, తడుముకుంటూనే కర్ర తీసే డు. “మోతీ! కుర్చీలోకి...’

ఉలిక్కిపడ్డా, నే చూస్తున్నది ఆ కళ్లతో నవ్వే కళ మూర్తేనా? కళ్లు! వాట్లతో, ఆ తేనెరంగుల్తో చూస్తేనే చాలు అని వుర్రూతలూగి న జవరాడ్రందరూ ముసలి వారయ్యారా? శివ్ ఈ కాలంలోనే గుడ్డి వాడయ్యాడా? పదేళ్ళు! ప్రపంచకమే మారింది. అచేతనాల్లోని క్యాలండర్ కాగితాలు చిరిగినవి. స్వతం త్రం వచ్చిందని బాధపడుతున్నాయి. దేవుడు గుళ్లు, గోపురాలు, మసీదులు, గుడి గంటలూ వీట్లకు ఏ విధంగా జీవం పోసి తిట్టనూ?

మోతీ దీనంగానే: చూపులో, గడచిన వసంతాల్ని స్మరణకు తెచ్చి ‘అవి వెళ్ళిపోయాయి’ అని చెపుతోంది. చిత్రాల సంపుటి శివ్ చేతుల్లో పెట్టేటప్పుడు చేతులు భయం తో వణికాయి. చెదిరిన గుండెల స్పందనం కణతల్లో ప్రతిబింబించింది.

ఎందుకాభయం! మోతీ నవ్వే పిల్చిందే! ఆదరణతోనే నన్ను తీసుకువచ్చిందే! కళ్లతోనే గిలిగింతలు పెట్టిందే! ఇప్పుడు ఈ ఎర్ర టి అట్ట పుస్తకంలోని నల్లటి పేజీల జీమూతాల్ని చూసి, ఎర్ర జెండాలనుకుని, గది మూలలకు పారిపోతోంది?

“జహర్! ఆరోజు సాయంత్రం! జ్ఞాపకం వుందా! పైన వర్షం పడుతోంది. ఆకాశం కడుపారగా రోదిస్తోంది. ఆనాడు ఇద్దరం తడిసే, ఆ మూసీనది మలుపులోని దుకాణంలో దీన్ని కొన్నాం.”

జీవితాన్ని వెనక్కు తొయ్యమని, ఆదేవతల్ని ఆక్రోందించే, మైకంలోని అనార్కలిలా! బల్లమీద పెట్టికళ్లు ఒత్తుకున్నాడు. కళ్లు! అవే! ఆ తేనెరంగు కళ్లే! వాటితో ఓరోజు తన దేశా న్ని కళాదృష్టిలో చిలికాడు. హిందోళ రాగం చేసేడు. ఈనాడు ఈ అంధత్వంలో ఆరాధిస్తున్నాడు. అంతరాత్మల్లోని సౌందర్యాన్ని వెతుక్కుంటున్నాడు. ఎక్కడదీ సామరస్యం గా ఏ ఖురాన్ చదివితే అర్థం అవుతుంది?

అట్ట తీసేడు, నల్లంచు బదెల్తో ఉల్లిపొర కాగితం అంచులు కప్పుకుంది. “ఆ రోజున అన్నావే! చార్మీనార్ చలితో వణుకుతోందని, అదే”

పరదా తొలగింది. గీతైనా లేని శిల్పుల కాగితం. తెల్లటి మల్లెపువ్వులా ఉంది. కుంచె లు గియ్యని శూన్యం. ఆ చీకటి చేతుల్తో స్తల నిర్దేశం చేస్తూనే” ఇక్కడ ఆ షరాబు కొట్టు, ఇక్కడ మూలగా పీచు మిఠాయి దుకాణం, ఇక్కడ చౌకీ నీడల్లో కళ్లు తుడుచుకుంటోం ది.” పొంగుతున్న ఆవేశంలో కళాఖండాల ఉపోద్ఘాతం చేస్తున్నాడు. ఆ స్వరం ఈ లోకానిది కాదు. మరో ప్రపంచానిది.

ఎక్కడ చూడనూ? గుండెలు పగిలేయి. దుఃఖం. అమరంలో ఉండే దేవతలు భూలోకానికి ఎందుకు వస్తారూ? ఋత్విక్కులు చదివే వేదం గ్రాహ్యం అవుతుందా?

“ఉందనే! ఆగరకు కాగితంమీద” అక్కడే ఉందని అతుక్కు పోయి సొగసు మళ్లించుకుందని, నాకోసం చెప్పు, అని కాటిక చారల కన్నీళ్లతో వణికే పెదిమల్తో, మోతీ ఆక్రోశించింది శూన్యంలో నావైపు చూస్తూ.

“ఔను శివ్ !”

చీకటి కళ్లు నవ్వాయి. “ఆనాడు తిట్టేవాడి వి. ఈ నాడు...” పునహః నవ్వుతూనే పేజీలు తీశాడు. ‘హుస్సేన్ సాగర్, వెయ్యి స్థంబాల ఆలయం, కింగ్ కోఠి, బీబీకా మఖ్చరా, అజంతా ఎల్లోరా కుడ్య చిత్రాలు, మక్కా మసీద్, రామప్ప దేవాలయం, టంకశాల, కాచిగూడా స్టేషన్... ఇలా ఎన్నో.

“జహర్! ఇదీ నా హైద్రాబాదు సంస్థా నం.. నాది నే పుట్టి పెరిగిన, రేపు మరణిస్తే మన్నయ్యే దేశం. ఆమరంగానే చిత్రించాల న్న ఆశతో, దేశ దేశాల్లో చాటాలన్న ఆతృతలో చిత్రించే. అయినా వాట్లని ఇప్పుడు ఆత్మతో చూస్తున్నా... ఆశల్లేని జీవితంతో... దేవుడు...’ గోరుతోనే కన్నీళ్లు చిల్లుక్కున్నాడు. రుగ్ధ కంఠం మూగబోయింది.

నా దేశం! నా మాణిక్యాల కళికలు. వాటి సౌరభంలో తప్తమవుతూ, హృదయం నిండిన ఆరాధనల్తో, కళాపిపాస వాక్కుల్లో, నేను, మోతీకూడా రంగులు వేసుకున్నాం.

“బావున్నాయా పాదుషా”

ఏం చెప్పగలనూ? కణకణం, నరనరం, ఉప్పొంగి ఉజ్వల ఆరాధనలో గవళం కుంటుపడింది. అమరంలోని కోశాలు అని, కన్న తల్లికి నవరత్నాల నివాళి. అయినా... జీవచ్ఛవమైన జరాభారం కాందిశీకిలాగే ఉండిపోయింది.

“నువ్వు అమరుడివి శివ్‌” శ్వాసలో రొమ్ములు పైకీ క్రిందకి సారించి నమస్కరించింది కృతజ్ఞతతో మోతీ.

“వెళ్ళి వస్తా” లేచే! ఆలోచిస్తున్న చిమ్మచీకట్లు నేత్రాలు కలలోంచి తెలివి తెచ్చుకుని, ఉలిక్కిపడ్డాయి.

“ఎప్పుడైనా ఈ ముసలివాణ్ణి చూడ్డానికి వస్తావుండు జహర్‌”

గుమ్మం దాటేటప్పుడు, ఆపుకున్న కన్నీళ్లు ఉబికాయి. మసగల్లోని ఆప్యాయత, ప్రేమ, ఆరాధనలతో హృదయం నివాళిపట్టింది. శూన్యం ప్రపంచకం గవళ మిప్పుకుంటోంది. ఈ క్షణిక వెయ్యి సంతాల్లో ఎల్లా నాట్యం చెయ్యనూ?

మోతీ చెయ్యి పట్టుకునే నడిపించింది.

“దాదా!” విశ్వ విపంచిలోని విషాదం.

“ఏం? తల్లీ”

‘ఆ వేసవిలో జబ్బుతో నాన్న గ్రుడ్డివాడయ్యాడు. ఆ చిత్రాల్లో ఆహోరాత్రాలు ములి గిపోయేడు. డాక్టర్లని చూడమన్నా చూడనేలేదు. బీదరికం వడిగంటు అయింది. ఎప్పు డూ గడపదాటని అమ్మ వాళ్లింట్లో, నెలకు పదిరూపాయల జీతంలో దాసీ పని చేస్తోం ది. ముగ్గురం.. ఆ బొమ్మలు... కళా ఖండాలు రహస్యంగా అమ్మేసి కుటుంబాన్ని వెళ్లదీశాం.”

కనుచిగుర్ల కళ్లు చేతిమీద, వేడిగా, బరువుగా చరిత్రల్తో తొణికాయి. బీదరికంలో తృప్తి, ఆనందం ఉందనుకున్నా... ఆకలి లేని నా జీవనం నన్ను ‘సీజర్ని’ చేస్తోంది.

“దాదా! అమ్మా నేను ఇద్దరం నాన్నకు క్షమించరాని కృతఘ్నత చూపేం. మేం అం టించిన ఆ తెల్లటి గరకు కాగితాలే, తమ దృష్టి ఉన్నప్పుడు వేసిన సంస్థానపు శోభ అనుకుని, ఈ నాటికి సృజించి, ఊహిస్తూనే కాలం గడుపుతున్నాడు.. కాని మేం మా త్రం...” బావురుమంది.

ఎక్కిళ్లు హృదయంలో ఆయాస పడుతున్నాయి. మోతీ ముంగుర్లు సవరించే కళ్లు తుడిచే అనునయం ఎల్లా చెయ్యనూ? ప్రపంచం కదిలిన రెప్పల్లో, మేఖ ఫించంలా ఊగుతున్న జీవితంలో, అనుభవం కన్న చూసి, స్పర్శించిన ఆవేదన, దుఃఖం కట్టవులు త్రెంచింది.

“దాదా! అమ్మనీ నన్నూ దేవుడు క్షమిస్తాడా?”

చితికిన గుండెలు చిక్క బట్టుకు ప్రయత్నంలో బూరుగుకాయ పేలిపోయింది రుగ్ధం, స్నిగ్ధత మేళవాల్లోనే కన్నీళ్లు వత్తే.

“క్షమిస్తాడమ్మా”

ఒక్కసారి చూసింది శృతి తప్పిన తీగలా. ఉప్పుచారల్లో నవ్వి “నిజంగా?”

మెట్లు దిగే, తలూపుతూనే తడిసిన చార్మీనార్ చమటార్చుకుంటోం ది. వీధి కుళాయి దగ్గర నల్ల చీర జవ్వని ‘స్వతంత్రం వచ్చిందట. మా ఆయిన మూడు సార్లు జైలుకు వెళ్లాడు. కాని నేను మాత్రం ఇల్లాగే వున్నా...” అని బిందె భుజానికెత్తుకుంది.

తోమిన బిందెలు, ప్రతిబింబాల్తో లంబా డీ వాళ్లలా ఉన్నాయి. ‘మూసీ... కోఠి... నాంపల్లి... మింట్... సికింద్రాబాద్...” దూరంగా, దూర దూరంగా.... వెనక్కు వెళ్లా యి... ఏడుస్తున్న కళ్లని, రుమాల్‌తో దాచుకునే చీకటి కళ్లుచేసుకున్నా.

(తెలుగు సాహిత్య అకాడమి ‘కథానికా గుచ్ఛం’ నుంచి)