22-07-2025 01:33:58 AM
కేటీఆర్, కవిత, హరీశ్‌రావు కనుసన్నల్లోనే హెచ్‌సీఏ అక్రమాలు
వారి గుప్పిట్లోనే పదేళ్లు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థ
* బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, కవిత, హరీశ్‌రావు కనుసన్నల్లోనే హెచ్‌సీఏలో అక్రమాలు జరిగాయి. పదేళ్లు రాష్ట్రంలో ని క్రికెట్ వ్యవస్థను వారి గుప్పిట్లోనే పె ట్టుకున్నారు. హెచ్‌సీఏను వారే కంట్రోల్ చేశారు. 2023 హెచ్‌సీఏ ఎన్నికల్లో కేటీఆర్, కవిత, హరీశ్‌రావుల ప్రమేయం ఉంది. వీరితోపాటు ఆ సమయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సంపత్ కుమార్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాలి.
టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి
* అసోసియేట్ క్లబ్‌ల తరఫున స్పోర్ట్స్ ఆఫీసర్లు ఓట్లు వేయాల్సి ఉన్నప్పటికీ, వారి స్థానంలో గత ఎన్నికల్లో సజ్జనార్, రోనాల్డ్ రాస్, సీవీ ఆనంద్, దాన కిశోర్ వంటి ఆఫీసర్లు నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేశారు. సజ్జనార్‌ను అడిగితే, ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ఓటు వేశామని చెప్పారు.
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాం తి): రెండేళ్ల క్రితం.. 2023 హెచ్‌సీఏ ఎన్నికల అంశంలో కేటీఆర్, కవిత, హరీశ్ రావు ప్రమేయం ఉందని, వీరితోపాటు ఆ సమయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరిం చిన సంపత్ కుమార్‌ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలోని తప్పుడు నిర్ణయాల వల్లనే గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు.
బీసీసీఐ నిబంధనలను హెచ్ సీఏ తుంగలో తొక్కిందని సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మండిపడ్డారు. బీసీసీఐ నిబంధనల్లో ఉన్న అసోసియేట్ మెంబర్‌షిప్ అంశం హెచ్‌సీఏ బైలాస్‌లో లేదని, ఈ కారణంగా బీసీసీఐ పాలక మం డలిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఫోర్జరీ సంతకాలతో జగన్‌మోహన్‌రావు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రావును అధ్యక్షుడిగా గెలిపించేందుకు గత ప్రభుత్వ పాలకులు దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. 2023 హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రావుకు 63 ఓట్లు రాగా, వాటిలో 23 ఓట్లు ఫ్రాడ్ అని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో వేరే వ్యక్తులతో ఓట్లు వేయించారు...
జస్టిస్ లోధా కమిటీ నివేదిక ప్రకారం క్రికెట్ అడ్మినిస్ట్రేటర్లుగా ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, మంత్రులు ఉండకూడదని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను దేశమం తా పాటిస్తున్నప్పటికీ హెచ్‌సీఏ మాత్రం పాటించడం లేదన్నారు. మొత్తం 216 క్లబ్బుల్లో 47 ఇనిస్టిట్యూషన్ మెంబర్‌షిప్ ఉన్న క్లబ్బులే ఉన్నాయని, ఈ క్లబ్బుల పేరిట ఎన్నికల్లో వేరే వ్యక్తులతో ఓట్లు వేయించారని తెలిపారు. ఇందులో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు కీలకంగా వ్యవహ రించారని ఆరోపించారు.
2023 హెచ్‌సీఏ ఎన్నికల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓటు వేసినట్టు ఆధారాలున్నాయని, సజ్జనార్‌ను అడి గితే ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ఓటు వేశామని చెప్పినట్టు గుర్తు చేశారు. వందలాది కోట్ల అవినీతికి పాల్పడి జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులను ఎదగకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో క్రికెట్ ఒక మతం అని, అలాంటి క్రికెట్‌కు తెలంగాణలో ఎంతో అన్యాయం చేశారని మండిపడ్డారు. దీనికి కారణమైన కేటీఆర్, కవితలను వెంటనే విచారించాలని డిమాండ్ చేశారు.
సమ్మర్ క్యాంపుల పేరిట కోట్లల్లో అవినీతి...
కేటీఆర్ బావమరిది వెబ్‌సైట్ ద్వారా ఆయనకు ఏం ప్రయోజనం చేకూర్చారో బయట పెట్టాలన్నారు. హెచ్‌సీఏ సభ్యులకు ఆస్తులు ఎలా పెరిగాయో బీసీసీఐ ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ చేయించాలని చెప్పారు. సమ్మర్ క్యాంపుల పేరిట జిల్లాల్లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటికి సంబంధించి లెక్కలన్నీ బయట తీయాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్లుగా స్పోర్ట్స్ రిక్రూట్‌మెంట్ జరగడం లేదని తెలిపారు.
హెచ్‌సీఏ పరిధిలోని 208 క్లబ్బులు ఉన్నప్పటికీ మళ్లీ హైదరాబాద్ జిల్లా పేరిట అసోసియేషన్ ఎందుకని ప్రశ్నించారు. జిల్లాల అసోసియేషన్లు ఎక్కడ ఉన్నాయి, జిల్లాల నుంచి ఎంతమంది రంజీ ట్రోపీలో ఆడుతున్నారని ఆయన నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 155 క్లబ్బు యాక్టీవ్‌గానే లేవని స్పష్టంచేశారు. హెచ్‌సీఏ బోర్డే పెద్ద ఫాడ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫ్రాక్సీ ఓట్లతో జగన్‌మోహన్‌రావు గెలిచారని, దీని వెనుక కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ఒత్తిడి చేశారని అధికారులు చెప్పినట్టు గుర్తు చేశారు. వందల కోట్లు దారి మళ్లుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి హెచ్‌సీఏ చేసిందేమీ లేదని, హెచ్‌సీఏ పరిధిలోని క్లబ్బులను వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలను టీసీఏకు వదిలేయాలి..
బీసీసీఐ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంటే హెచ్‌సీఏ మాత్రం పిల్లల భవిష్యత్ నాశనం చేస్తుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేసిన అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఫస్ట్ క్లాస్, రంజీ ట్రోపీ ఆడితే పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, కానీ ఈ అంశాన్ని హెచ్‌సీఏ పెడచెవిన పెట్టి అక్రమాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
వాస్తవానికి అసోసియేట్ క్లబ్‌ల తరఫున స్పోర్ట్స్ ఆఫీసర్లు ఓట్లు వేయాల్సి ఉన్నప్పటికీ వారి స్థానంలో గత ఎన్నికల్లో సజ్జనర్, రోనాల్డ్ రాస్, సీవీ ఆనంద్, దాన కిషోర్ వంటి ఆఫీసర్లు నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు వేశారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో 3 అసోసియేషన్లు ఉన్నాయని, తెలంగాణలో రెండు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. జిల్లాలు పెరిగినా క్రికెట్ అసోసియేషన్లు ఎందుకు పెంచడం లేదన్నారు.
క్రికెట్‌కు సంబంధించి జిల్లాల పరిపాలన టీసీఏకు వదిలేయాలని హితవు పలికారు. పరిపాలన విస్తరిస్తున్నట్టే క్రికెట్ అసోసియేషన్ల విస్తరించాలని, ప్రతిభను కనబర్చేందుకు అభ్యర్థులకు వేదికను కల్పించాలని సూచించారు. హెచ్‌సీఏ అక్రమాల వెనుక ఉన్న వ్యక్తులపై దర్యాప్తు చేయాలని సీఐడీ, ఈడీని కోరారు. బీసీసీఐ, టీసీఏ ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.