22-07-2025 01:23:22 AM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో 49ని రద్దుకు ఆందోళన
దిగివచ్చిన ప్రభుత్వం జీవోను రద్దు చేస్తున్నట్టు ప్రకటన
హైదరాబాద్/ఆదిలాబాద్/ కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 21 (విజయక్రాంతి)/బెల్లంపల్లి అర్బన్: జీవో నంబర్ 49ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు చేపట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ విజయవంతమైంది. బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు పూర్తి మద్ద తు ప్రకటించాయి. సోమవారం ఉదయం నుంచే తుడుం దెబ్బతో పాటు ఆదివాసీల్లోని 9 తెగల సంఘాల నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూర్, ఏజెన్సీ ప్రాం తాల్లో బస్ డిపోల ఎదుట బైటాయించారు.
ఒక్క బస్సు సైతం డిపో నుంచి బయటకు రాలేదు. దీంతో డీఎస్పీ జీవన్‌రెడ్డి, పోలీసులు ఆదివాసీ నేతలతో మంతనాలు జరపడంతో బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అటు ఆదివాసీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ తెరిచి ఉన్న దుకాణాలను మూసి వేయించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లా కాసిపేటలో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కాసిపేట ప్ర ధాన రహదారిపై బైటాయించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని మద్దతు తెలిపారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు బంద్ ను పర్యవేక్షించారు. జీవో 49తో రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటుతో జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయే పరిస్థితి వస్తుందన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడౌన్ గణేష్ మాట్లాడుతూ.. జీవో 49తో ఆదివాసీల అస్తిత్వం దెబ్బతింటుందని అన్నారు.
అడవుల నుంచి ఆది వాసీలను వెళ్లగొట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ధ్వజ మెత్తారు. ఆదివాసీలకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వం జీవో 49 అమలు వాయి దా వేయడం తమ పోరాట విజయమని పేర్కొన్నారు.
జీవో 49ని నిలిపివేసిన ప్రభుత్వం
ఆదివాసీల ఆందోళనలో కుమ్రంభీమ్ కన్జర్వేషన్ కారిడార్ కోసం ప్రకటించిన జీవో 49ని ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించిన తర్వాత ఆదేశాలు వెలువడ్డాయి. జీవోను నిలిపివేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసి సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి.
కాగా జీవో 49 మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల్లో అనుమానాలు, అభ్యంతరాలు నెలకొ న్న నేపథ్యంలో వాటిపై పలు దఫాలు మం త్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రులు సమావేశాలు నిర్వ హించి, సమగ్ర వివరాలు సేకరించారు.
ఇటీవల జరిగిన పరిణామాలతో కలెక్టర్ నుంచి మరొకసారి నివేదిక తెప్పించుకున్న ప్రభు త్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. పులు ల కారిడార్ కవ్వాల్ అభయారణ్యంలో భా గంగా ఉన్న ఆసిఫాబాద్ ప్రాంతాన్ని కుమ్రంభీం పులుల కన్జర్వేషన్ రిజర్వుగా మారుస్తూ గత నెల 30న అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.
జిల్లాలోని ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్, సిర్పూర్, కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌లలో లక్ష 49 వేల హెక్టార్లను టైగర్ రిజర్వులోకి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జీవో విడుదల కోసం 330 ప్రభావిత గ్రామాల ప్రజల్లో నెలకొన్న అనుమా నాలా నివృత్తి చేసేందుకు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో మంత్రులు సమగ్ర వివరాలు సేకరించారు.
ఆదివాసీలకు ఇబ్బందులు రానివ్వం: మంత్రి కొండా సురేఖ
జీవో 49 మీద ఆదివాసీలు, గిరిజనులకు ఎటువంటి ఆందోళన వద్దని, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడవి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటుందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూడా ఆదివాసీలకు ఇబ్బందులకు రాకుండా చూసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ధ్యేయం అని మంత్రి సురేఖ అన్నారు.