calender_icon.png 22 July, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జెండా రెపరెపలు

22-07-2025 12:00:00 AM

దేశ ఔన్నత్యం, ఐక్యత, దేశ భక్తి, త్యాగం, జాతి గౌరవం, ఆకాంక్షలు, న్యాయం, సార్వభౌమాధికారం, శాంతి, సౌభాగ్యం, స్వేచ్ఛా స్వాతంత్య్ర పోరాటాలకు ఏకైక చిరునామాగా త్రివర్ణ పతాకం నిలుస్తున్నది. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22న మన భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.

1947 జూలై 22న మన జాతీయ పతాకాన్ని ఆమోదిం చడంతో అప్పటి నుంచి ఏటా జూలై 22న దేశవ్యాప్తంగా భారతీయులు “జాతీయ పతాక ఆమోద దినోత్సవం లేదా జాతీయ పతా క దినోత్సవం ( నేషనల్ ఫ్లాగ్ డే ఆర్ నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే)” రూపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. చేనేత వస్త్రంతో మాత్రమే రూపొందిస్తున్న మన జాతీయ జెండా 2:3 నిష్పత్తితో దీర్ఘ చతురస్రాకారంలో మూడు రంగులతో, అశోక చక్రం అమర్చబడి అందంగా ఉంటుంది.

1906 ఆగస్ట్టు 7న ఆకుపచ్చ, పసుపు, ఎరుపు వర్ణాలతో కూడిన జాతీయ పతాకాన్ని అనధికారంగా కలకత్తాలో ఎగురవేశారు. 1907లో కాషాయం, పసుపు, ఆకుపచ్చ వర్ణాలతో కూడిన జెండాను బెర్లిన్ కమిటీ రూపొందించింది. అనంతరం అనిబిసెంట్, బాలగంగాధర తిలక్ లాంటి దేశభక్తులు యూనియన్ జాక్ సంతకంతో కూడిన పతాకాన్ని ఎగురవేశారు.

1921లో జరిగిన బెజవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో తెలుగు తేజం పింగళి వెంకయ్య రూపొందించిన మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించారు. ఈ జాతీయ జెండాను 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ అధికారికంగా ఆమోదించడం ఒక అపూర్వ ఘట్టం గా దేశ స్వాతంత్య్ర చరిత్రలో నిలిచిపోయింది.

ప్రతి భారత పౌరుడు తన ఇంటి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవచ్చని 2002లో ప్రకటించారు. 2005లో మరికొన్ని అదనపు వాడుకకులను అనుమతిస్తూ సవరించారు. జాతీయ జెండాను ఉదయం ఎగురవేసి సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు వరకు ఉంచుకోవచ్చని, మతపరమైన సందర్భాల్లో వాడకూడదని, నేలను గాని నీటికి గాని తగలకుండా చూసుకోవాలని, జాతీయ జెండా కన్నా ఎత్తులో మరో జెండా ఉంచకూడదనే నియమనిబంధనలు కూడా చేర్చారు. 

 డా. బుర్ర మధుసూదన్ రెడ్డి