04-08-2024 12:00:00 AM
కె.రామకృష్ణ :
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయం యావత్తు దేశాన్ని కలచివేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారు జామున ఆ జిల్లాలోని మెప్పాడి సమీపంలో వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి కింద ఉన్న నివాస ప్రాంతాలపై పడ్డంతో గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకు పోయాయి. వందలాదిమంది బురదలో కూరుకుపోయి చనిపోగా పక్కనే ఉన్న నదీ ప్రవాహంలో పలువురు కొట్టుకు పోయారు. ఇప్పటి వరకు 350 మందికి పైగా చనిపోగా, మరో 280 మంది ఆచూకీ గల్లంతయింది. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అవిశ్రాంతంగా గాలిస్తున్నాయి. దాదాపు పదివేల మందిని సహాయక శిబిరాలకు తరలించారు.
ఈ క్రమంలో మూడు, నాలుగు రోజుల తర్వాత కూడా శిథిలాల కింద చిక్కుకు పోయిన కొంతమంది ప్రాణాలతో బైటపడి మృత్యుంజయులుగా మారారు. కొండ పైభాగంలో ఓ గుహలో తలదాచుకున్న నలుగురు చిన్నారులుసహా ఓ గిరిజన కుటుంబాన్ని అటవీ సిబ్బంది అత్యంత శ్రమకోర్చి కాపాడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ విలయం వెనుక మానవ తప్పిదాలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసినా అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. కారణాలేమైనా కానీ, వందలాదిమంది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. వరదల్లో ఓ హైస్కూలు పూర్తిగా ధ్వంసమైందని, పలు పాఠశాలలూ దెబ్బతిన్నాయని, దాదాపు 49 మంది చిన్నారుల జాడ తెలియడం లేదంటూ రాష్ట్రమంత్రి ప్రకటించారు. బాధితులను ఆదుకోవడానికి పారిశ్రామిక వర్గాలు, సినీరంగంతోపాటు రాజకీయ పార్టీలు, రాష్ట్రప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి.
ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు
ఓవైపు వయనాడ్ విలయం ప్రజల మనసుల నుంచి మాసిపోక ముందే ఉత్తరాదిన పలు రాష్ట్రాలు వరదల తాకిడికి అతలాకుతలమవుతున్నాయన్న వార్తలు మరింత భయపెడుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో మెరుపు వరదల్లో ఓ గ్రామం పూర్తిగా కొట్టుకుపోగా ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది. ఈ వరదల్లో గ్రామంలోని 60 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మరో 50 మందికి పైగా గ్రామస్థుల ఆచూకీ తెలియడం లేదు. ఉత్తరాఖండ్‌లో వందలాది మంది కేదార్‌నాథ్ యాత్రికులు చిక్కుకు పోవడంతో వారిని కాపాడడానికి ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. యాత్ర ను తాత్కాలికంగా నిలిపివేశారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రా లు ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో అల్లాడుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశంలో సగటు వర్షపాతానికి మించి నమోదు కావచ్చంటూ ఐఎండీ చేసి న హెచ్చరిక మరింత కలవరపెడుతున్నది.
17 రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు
కరవులు, వరదలు, కొండచరియలు విరిగిపడడం లాంటి ప్రకృతి వైరీత్యాలకు గురయ్యే దేశాల్లో భారత్ ఒకటన్న శాస్త్రజ్ఞుల హెచ్చరికలను ఈ ఉపద్రవాలు మరోసారి గుర్తుకు తెస్తున్నాయి. 2023 నాటి భారత అంతరిక్ష పరిశోణ కేంద్రం (ఇస్రో) ‘లాండ్‌స్లుడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని 17 రాష్ట్రాల్లోని 147 జిల్లాలు కొండచరియలు విరిగిపడే ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం జిల్లాల్లో 20 శాతం కావడం గమనార్హం. కేరళలోని మొత్తం 14 జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒక్క అలప్పూజ జిల్లా మాత్రం 123వ స్థానంలో ఉండగా, మిగతా జిల్లాలన్నీ కూడా టాప్ 50లోనే ఉన్నాయి. అయితే, సమస్య ఒక్క కేరళకే పరిమితం కాలేదు.
దేశంలోని అన్ని ప్రాంతాలూ ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి. కేరళ తీర ప్రాంతాల మాదిరిగానే హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని అన్ని జిల్లాలూ ఇస్రో హెచ్చరిక జాబితాలో ఉన్నాయి. మిజోరాం లాంటి చిన్న రాష్ట్రంలో గత 25 సంవత్సరాల్లో 12,385 కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే, సగటున రోజుకు కనీసం ఒక ఘటన అన్నమాట. గత అయిదేళ్లలో భారత్‌లో వాతావరణ సంబంధ విపత్తుల కారణంగా రూ.4.70 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని గత మే నెలలో ఆసియా అభివద్ధి బ్యాంక్ (ఏడీబీ)పేర్కొంది. ఇది భారత రక్షణ బడ్జెట్‌లో 70 శాతానికి, నెలవారీ జీఎస్టీ వసూళ్లలో 3 శాతంకు పై మొత్తానికి సమానం.
అభివృద్ధి పేరిట విధ్వంసం
ఈ లెక్కలేవీ సమస్య తీవ్రతపై ప్రభుత్వాల ఉదాసీనతను ఏ మాత్రం తక్కువ చేయలేవు. తమ చేతకానితనాన్ని, సుస్థిర అభివృద్ధి పేరుతో నిబంధనలను పట్టించుకోకపోవడాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ఈ విలయాలన్నిటినీ ప్రకృతి విపత్తులంటూ చేతులు దులిపేసుకుంటున్నాయి. వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నా యనే చెప్పాలి. అన్ని విపత్తులకు వాతావరణ మార్పులు, భూతాపం పెరగడం కార ణమని చెప్పడం ఎంతమాత్రం సరికాదు. వయనాడ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి కురవడం కొండచరియలు విరిగి పడడానికి దారి తీసినప్పటికీ 1950 నుంచి ఈ ప్రాంతంలో ఇష్టారాజ్యంగా పెరిగిన జనావాసాలు, అభివృద్ధి కారణంగా 62 శాతం అటవీ ప్రాంతం కనుమరుగయిందనేది వాస్తవం. అధికారులు ఏమైనా చెప్పవ చ్చు కానీ ఈ నష్టాన్ని పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం లాంటి వాటిద్వారా భర్తీ చేయలేం. కోజికోడ్- వయనాడ్ సొరంగ మార్గం లాంటి ప్రాజెక్టులపైనా నిపుణులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాదిన హిమాచల్‌ప్రదేశ్‌లో గత ఏడాది సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడ్డంపైనా ఇలాంటి వాదనలే అధికారులు, ప్రభుత్వ పెద్దలు చేయవచ్చు. అయితే, ముఖ్యంగా కులు, సిమ్లా లాంటి చోట్ల అవసరానికి మించి పర్యాటకాన్ని ఆకర్షించడం కోసం పెద్ద ఉత్తున చేపట్టిన నిర్మాణాలు ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బ తీసిందనేది కాదనలేని వాస్తవం. భారీ జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణం, భారీ యంత్రా లను ఉపయోగించి హైవేల నిర్మాణం కోసం కొండలను తవ్వేయడం పట్ల భౌగోళిక శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ పరిస్థితి ఇంతకన్నా దారుణం.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న జాబితాలో రుద్రప్రయాగ్, తెహ్రీ జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయినా, అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విలయాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకు న్నట్లు కనిపించడం లేదు. 2013లో వచ్చిన కేదార్‌నాథ్ విలయం, 2021 నాటి రిషిగంగ వరదలు, 2022నాటి జోషీమఠ్ విలయం.. ఇలా వరస విపత్తులు రాష్ట్రాన్ని ముంచెత్తినా ప్రభుత్వం నిపుణుల హెచ్చరికలను, స్థానికులు ఆందోళనలను పట్టించుకుంటున్న జాడలేదు. దీనికి భిన్నంగా సముద్ర మట్టానికి 3,100కు మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న బద్రీనాథ్ ఆలయంకోసం భారీ మాస్టర్‌ప్లాన్ అమలు కోసం ప్రయత్నిస్తున్నది. అలాగే, కర్ణప్రయాగ్- రిషీకేశ్ రైల్వే లైన్ ప్రాజెక్టు కారణంగా తమ ఇళ్లు పగుళ్లు ఇస్తున్నాయంటూ స్థానికులు చేస్తున్న ఆందోళన కూడా వారి చెవికెక్కడం లేదు.
ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి
కొండచరియల కారణంగా సంభవించే మరణాల్లో దాదాపు 80 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతున్నాయని ‘జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ నివేదిక పేర్కొన్నది. అభివృద్ధి పేరుతో నిబంధన లకు నీళ్లొదిలి పెద్ద ఎత్తున అడవులు, కొండప్రాంతాల విధ్వంసానికి పాల్పడడమే దీనికి ప్రధాన కారణమని విధానకర్తలను ఆ నివేదిక పరోక్షంగా హెచ్చరించింది. ఈ నేపథ్యం లో భారీ ప్రాజెక్టుల నిర్మాణాల విషయం లో కఠిన నియమ నిబంధలను రూపొందించాలని చట్టసభల ప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ముక్తకంఠంతో డిమాం డ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. న్యాయస్థానాలు ఇలాంటి విషయాలు తమ దృష్టికి వచ్చినప్పుడు జోక్యం చేసుకుని ప్రభుత్వాలను కట్టడి చేయాలి.