15-10-2025 07:13:19 PM
21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో సదస్సు
లైఫ్ సైన్సెస్ పై అంతర్జాతీయ వేదికలో కీలక ఉపన్యాసం
కాటారం (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. దీంతో మంత్రి శ్రీధర్ బాబు స్వంత నియోజకవర్గమైన మంథనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అటు పెద్దపల్లి జిల్లాలో గల మంథని నియోజక వర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 'ఆసియా-పసిఫిక్' ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే సదస్సులో కీలకోపన్యాసం చేయాలని నిర్వాహకులు ఆహ్వానం పలికారు. అస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో కీలక ఉపన్యాసం చేయాలని ఆహ్వానంలో పేర్కొన్నారు.
దేశంలో ఈ తరహా గౌరవం దక్కిన ఏకైక మంత్రి గా శ్రీధర్ బాబు రికార్డ్ నెలకొల్పారు. మంత్రి శ్రీధర్ బాబును ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఆహ్వానించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ అనుకూలతలు, అవకాశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు కొత్త పెట్టుబడులు తీసుకొచ్చే అరుదైన అవకాశంగా భావిస్తున్నారు.