15-10-2025 07:17:06 PM
ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మహిళలు అన్ని వయసుల వారు పోషకాహారంతో లభించే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పడుతుందని మరిపెడ మండలం పరిషత్ అధికారి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన మరిపెడ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి వేణుగోపాల్ రెడ్డి, మండల వైద్యాధికారి గుగులోతు రవి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు, గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేందుకు సమాజంలో పోషణపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని చెప్పారు. ఐసిడిఎస్ లబ్ధిదారులైన గర్భిణీ స్త్రీల పోషణ స్థితిని మెరుగుపరిచినట్లయితే మన భావితరాల పిల్లలు ఆరోగ్యంగా జన్మనివ్వడం జరుగుతుందన్నారు.
భావితరాలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందన్నారు. ఒక కుటుంబం,గ్రామం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ప్రత్యేకమని అన్నారు. పోషణ మాసంలో భాగంగా ఏర్పాటుచేసిన కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్, గర్భిణీలకు సామూహిక సీమంతాలు, ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అన్నప్రాసనలు, అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యకి నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ ఎల్లమ్మ, ఎంపీఓ సోమలాల్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.