05-01-2026 02:18:07 AM
8న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో పదవుల విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేషకుమార్‌గౌడ్ తీపి కబురు చెప్పారు. ఈనెల 8 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ కూర్పుపై పూర్తి నివేదిక ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. ఇక ఈ నెల 15లోపు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలను పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శు లు విశ్వనాథన్, సచిన్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 8న గాంధీభవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మగాంధీ పేరు తొలగించడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని, తెలంగాణలో నూ పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగానే ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించిందని మండిపడ్డారు. జాతీయ ఉపాధి హామీ పథకంతో పేదలకు పని కల్పించి ఆర్థికంగా ఆదుకున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.