05-01-2026 02:18:31 AM
బీజేపీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు సీరియస్
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): బీజేపీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సీరియస్ అయ్యారు. శాసనసభలో శనివారం కృష్ణా నది జలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే లు పాల్వాయి హరీశ్, ధన్‌పాల్ సూర్యనారాయణ, రామారావు పాటిల్ కునుకుతీశారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోమవారం శాసనసభలో హిల్ట్ పాలసీపై చర్చ జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలతో రాంచందర్ రావు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభు త్వానికి ధీటుగా ఎదుర్కోవడం, అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేశారు.
నదీ జలాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలను కార్నర్ చేయడంలో బీజేపీ విఫలమైందన్న చర్చ జరగుతుండటంతో ఈ కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సభలో నిద్ర ఘటనపై ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమైన చర్చ జరుగుతుంటే సభలో నిద్రపోతారా? ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? అని అడిగినట్లు తెలుస్తోంది.
నేడు ఆఫీస్ బేరర్ల సమావేశం
నేడు రాంచదర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పార్టీ కార్యాలయం లో జరగనుంది. దీనికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ హాజరుకాను న్నారు. మున్సిపల్ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలా గే బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ పాత్రపై చర్చించనున్నారు.
దీనికితోడూ పార్టీలో అంతర్గత పోరు, నేతల మధ్య గ్యాప్‌పైన అభయ్ పాటిల్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి స్టేట్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి హాజరు కానున్నారు.