calender_icon.png 7 October, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస దొంగతనాలు..పోలీసులు మేల్కొంటారా?

07-10-2025 12:28:16 AM

  1. దసరా సెలవులను సద్వినియోగం చేసుకున్న దొంగలు
  2. ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఇంటికే దొంగల దాడి
  3. రిటైర్డ్ ఉద్యోగి ఇంటి నుంచి బంగారం, వెండి, నగదు మాయం
  4. చందానగర్ పరిధి దొంగల అడ్డాగా మారిందని ప్రజల ఆగ్రహం

శేరిలింగంపల్లి,అక్టోబర్ 6  (విజయక్రాంతి): దసరా సెలవుల హడావుడి మధ్య చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు ఆడిపాడుతున్నారు. పోలీసులు పహారా కాస్తారని నమ్మకం ప్రజల్లో ఉండగా వాస్తవంలో దొంగలు స్వేచ్ఛగా చోరీలతో విర్రవీగుతున్నారు. వరుస ఘటనలతో ప్రాంత ప్రజలు భయంతో తలుపులు మూసుకుంటే, పోలీసుల మాత్రం నిద్రపోవడమే కనిపిస్తోంది.

ఓల్ ఎంఐజి కాలనీలో నివసించే సీతారామ్మూర్తి అనే రిటైర్డ్ బిహెచ్‌ఎల్ ఉద్యోగి ఇంట్లో దొంగలు పడ్డారు. కుటుంబం గత నెల 29న సత్యసాయిబాబా దర్శనానికి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి తలుపులు పగులగొట్టి ఇంట్లోని ఆభరణాలు మాయం చేశారని చెప్పారు. దొంగలు 18 తులాల బంగారం, 60 తులాల వెండి, కొంత నగదు దోచుకెళ్లినట్లు ఆయన ఫిర్యాదు చేశారు.

ఇక మరో ఘటనలో మియాపూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఇంటికీ దొంగలు చొరబడ్డారు. రైల్వే విహార్లోని ఆయన నివాసంలో శనివారం రాత్రి చోరీ జరగగా,5 తులాల బంగారం, రూ.40 వేల నగదు మాయం చేశారు. పోలీసుల కళ్లముందే ఇంత దైర్యంగా దొంగలు చెలరేగిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోజూ రౌండ్లు వేస్తున్నామని చెప్పే పోలీసులు ఎక్కడ ఉన్నారు?

రాత్రిళ్లు దొంగలు తిరిగినా గస్తీ లేకపోవడం ఎందుకు? అని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఖజానా జ్యువెలర్స్, పలు దేవాలయాల్లో జరిగిన చోరీలు మరువక ముందే మళ్లీ రెండు ఇళ్లు దోచుకోవడం పోలీసు యంత్రాంగ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

చందానగర్ పరిధి దొంగల అడ్డాగా మారుతుండగా, నిఘా విఫలమైందని స్థానికులు చెబుతున్నారు. ఇంత వరుసగా చోరీలు జరిగినా చర్యలు ఏవీ తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దొంగలు స్మార్ట్గా మారితే,పోలీసులు ఎందుకు స్లోగా? అంటూ హైదరాబాద్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.