18-08-2024 12:20:04 AM
బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి): సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు గాలం వేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేశారు. అంతా చేతికి వచ్చాక చివరకు కంపెనీ బోర్డు తిప్పేసి రూ.కోట్లతో ఉడాయించారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని అయ్య ప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో కొంత కాలం క్రితం ‘ప్రైడ్ హబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట కంపెనీ వెలసింది. కంపెనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలిస్తామని సుమారు 200 మంది నిరుద్యోగులను నమ్మించింది.
ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున రూ.3 కోట్ల వరకు వసూలు చేసింది. అనంతరం శిక్షణ పేరుతో కొద్దిరోజులు నిరుద్యోగులకు శిక్షణ సైతం ఇచ్చింది. ఇక తమకు ప్లేస్‌మెంట్స్ వస్తాయని నిరుద్యోగులు భావిస్తున్న తరుణంలో కంపెనీ బిచానా ఎత్తేసింది. రోజు మాదిరిగానే కంపెనీకి వెళ్లిన ఆశావహులకు శనివారం చుక్కెదురైంది. కార్యాలయానికి తాళం వేసి ఉండడాన్ని చూశారు. ఎంతసేపటికీ తాళం తెరుచుకోకపోవడంతో తాము మోసపోయామని గుర్తించి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన మదిశెట్టి వీరా అనే బాధితుడి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.