05-08-2025 01:13:35 AM
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): 1 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ, విద్యార్థులకు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీ- వార్మింగ్ డే (జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం) పై కలెక్టర్ జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్వాడీలు, జూనియర్ కళాశాలలు, సంక్షేమ హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు ఈ నెల 11న అల్బెండజోల్ మాత్రలు వేయడానికి మరియు ప్రతి విద్యార్థికి మాత్రలు వేసేలా చూసుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆయన అన్నారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ అల్బెండజోల్ మాత్రలు వేసుకుని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం వల్ల పిల్లలకు ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని, మట్టి, గడ్డిలో పాదరక్షలు లేకుండా ఆడటం వల్ల శరీరంలోకి నులి పురుగులు ప్రవేశించి కడుపు నొప్పి, రక్తహీనత, వాంతులు, బరువు తగ్గడం, ఆకలి వేయకపోవటం, అలసట వంటి సమస్యలు వస్తాయని అన్నారు. చిన్నారులకు పిల్లలకు సిరప్, 2-3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పూర్తి మాత్రలు అందిస్తామని, దీని కోసం సంబంధిత పాఠశాలల్లో సైన్స్ టీచర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తామని ఆయన వివరించారు.జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ ఓ సంగీత, డిఆర్డిఎ పిడి శ్రీలత, డిపిఓ సురేష్ మోహన్, డిఇఓ సుశీందర్ రావు లు పాల్గొన్నారు.