గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక విధానం
విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, ఆగస్ట్ 20, (విజయ క్రాంతి): ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ అధికారులతో ప్రవాసులు, వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విదేశాల్లో పనిచేస్తున్న తమ దేశ పౌరుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ బృందానికి వివరించారు.
వలస కార్మికుల రక్షణ, సంక్షేమం, వారి కుటుంబాలకు అందించే సహాయ కార్యక్రమాలపై సమాచారాన్ని అందించారు.కమిటీ ఛైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులకు మరింత మెరుగైన సహకారం, రక్షణ కల్పించే అంశాలపై ఫిలిప్పీన్స్ అధికారులతో వారు చర్చించారు.
ఫిలిప్పీన్స్ అమలు చేస్తున్న వలస కార్మికుల విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 15 లక్షల మంది కార్మికులకు అండగా నిలిచేలా త్వరలో ప్రత్యేక విధానాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్, డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం ఫిలిప్పీన్స్ పర్యటనలో భారత విదేశాంగ శాఖ ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ సంపూర్ణ సహకారం అందించారు.






