26-05-2025 01:25:24 AM
-ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్ల నియామకం వద్దు
-పుండు మీద కారం చల్లినట్టు యాజమాన్యం చర్యలు
-ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది
-హామీలు అమలు చేయకపోతే సమ్మెకు వెళ్తాం..
-ప్రభుత్వానికి జూన్ 2 డెడ్‌లైన్ విధించిన ఆర్టీసీ జేఏసీ
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలని..ప్రైవేట్ ఏజెనీ ్సల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లు, డ్రైవర్లను నియమించే విధానం మానుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ డిమాండ్ చేసింది.
ఈనెల 6వ తేదీన సచివాలయంలో జరిగిన చర్చల సందర్భం గా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీల్లో యూనియన్ల పునరుద్ధరణ కూడా ఉందని జేఏసీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
అయినా కూడా ఆర్టీసీ యాజమాన్యం వెల్ఫేర్ బోర్డ్ మీటింగ్ గురించి సర్క్యులర్ జారీచేయ డం పుండు మీద కారం చల్లినట్లుగా ఉం దని.. ఈ సర్క్యులర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అడ్డుపడే విధంగా ఉందని జేఏసీ భావిస్తోందన్నారు.
విద్యుత్ బస్సులపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా కాంగ్రె స్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని.. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో ఈ బస్సులు తీసుకొస్తే సహించబోమన్నారు. యాజమాన్యం చర్యల వల్ల ప్రభుత్వం మీద కార్మికులకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మె వాయిదా వేసుకున్నా మని..సర్కారు ఇచ్చిన హామీలు కొన్ని పరిష్కారం అవుతాయని వేయికళ్లతో కార్మిక వర్గం ఎదురుచూస్తున్న సమయంలో ఆర్టీసీ ఎండీ ఇటువంటి సర్క్యులర్ ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం సమంజసం కాదని జేఏసీ నాయకులు అన్నారు.
ఆర్టీసీలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ ఏజె న్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్, డ్రైవర్లను నియమించడం, ప్రైవేట్ బస్సులను తేవడం, గ్యారేజ్‌లు మొత్తం ప్రైవేట్ పరం చేయడం, రిటైర్ అయినా అధికారులను బ్యాక్ డోర్ ద్వారా తిరిగి భర్తీ చేయడం వంటివి ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికేనని జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది.
వెంటనే ఔట్ సోర్సింగ్ నియామకాలు ఆపాలని లేదంటే సమ్మెబాట తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ యాజమాన్యం కవ్వింపు చర్యలు విడనాడాలని, మొన్నటి సమ్మె కేవలం వాయిదా మాత్రమేనని విరమణ కాదని గుర్తు చేస్తున్నామని హెచ్చరించారు.
జూన్ 2 వరకు ప్రభుత్వం జేఏసీకి ఇచ్చిన హామీలు అమలు చేయని పక్షంలో మళ్లీ సమ్మె వైపు వెళ్తామని, దీనికి పూర్తి బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం వహించాల్సి వస్తుందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ హనుమంత్ ముదిరాజ్, వైస్ చైర్మన్, థామస్‌రెడ్డి స్పష్టం చేశారు.