26-05-2025 01:12:11 AM
- ఏరియా ఆస్పత్రుల్లోనూ అవుట్ పేషెంట్లకు దొరకని పరిస్థితి
- జిల్లా ఆస్పత్రుల్లో కూడా కేవలం ఇన్‌పేషెంట్లకే ఇన్సూలిన్
- అంతా బాగానే ఉందని చెప్తున్న టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులు
- ప్రభుత్వం స్పందించాలని కోరుతున్న షుగర్ పేషెంట్లు
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): ‘నేను రాను బిడ్డో సర్కారు దవా ఖానకు..’ అన్న పరిస్థితులు మళ్లీ రాష్ట్రం లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు కష్టాలు తప్పడం లేదు. షుగర్ వ్యాధి బారిన పడిన రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పేద రోగులైతే ఇక వారి కష్టాలు చెప్పనక్కరలేదు.
ఇంతటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న మధుమేహం విషయంలో ప్రభుత్వం తీరు సక్రమంగా లేదని రోగు లు వాపోతున్నారు. రాష్ట్రంలో షుగర్ వ్యాధి బారిన పడిన వారిలో పేద రోగు ల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో ఇన్సూలిన్ సప్లు ఆగిపోయింది.
రోగులు రెగ్యులర్‌గా పీహెచ్‌సీ చుట్టూ తిరుగుతున్నా ఫార్మసిస్టులు మాత్రం స్టాక్ రాలేదని చెప్తూ కాలం వెల్లదీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు రాష్ట్ర రాజధాని నగరంలో నూ అదే పరిస్థితి. అమీర్‌పేటలో ఉన్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇన్సులిన్ సప్లుపై ‘విజయక్రాంతి’ ఆరా తీయగా ఇన్ పేషెంట్లకు మాత్రం ఇన్సూలిన్ ఇస్తున్నామని..అవుట్ పేషెంట్లకు ఇన్సూలిన్ ఇవ్వడం లేదని సిబ్బంది తెలిపారు.
ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించిన జిల్లా ఆస్పత్రుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఉస్మానియా, గాంధీ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇన్సూలిన్ కొరత లేకున్నా మిగతా జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీ, పీహెచ్‌సీల్లో ఇన్సూలిన్ లేదని ఫార్మసీలో తిప్పిపంపుతున్నారని రోగులు వాపోతున్నారు.
ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పీహెచ్‌సీల్లో ఆరా తీసినా ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లా ఆస్పత్రుల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇన్‌పే షెంట్లకు మాత్రం ఇన్సూలిన్ అందుబాటులో ఉంచుకుని రెగ్యులర్‌గా ఇన్సూలిన్ కోసం వచ్చే రోగులకు మాత్రం లేదని తిప్పిపంపిస్తున్నారు.
ఈ అంశంపై మాట్లాడేం దుకు సంబంధిత వైద్యులు కానీ సిబ్బంది కానీ ముందుకు రావడం లేదు. ఇన్సూలిన్ సప్లు లేదనే మాట వాస్తవం కానీ హాస్పిటల్ పేరు, ఊరు పేరు కూడా మెన్షన్ చేయవద్దంటూ పలువురు సిబ్బంది విజయ క్రాంతిని కోరారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్టాక్స్ వివరాలు, సరైన సమాచారం ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అంతా బాగుందని చెప్పేందుకే ప్రయత్నించారు.
అక్కడ లేదంటే ప్రైవేటులో కొంటున్నాం..
నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన షుగర్ పేషెంట్ రెగ్యులర్‌గా పీహెచ్‌సికి వెళ్లి ఇన్సూలిన్ తీసుకునేవాడు. అయితే గత నెల రోజులుగా అక్కడ ఇన్సూలిన్ లేదని చెప్తుంటే ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నట్లు ‘విజయక్రాంతి’కి తెలిపారు. ఎన్నిసార్లు హాస్పిటల్‌కు వెళ్లినా స్టాక్ రాలేదనే అంటున్నారని అందుకే అప్పు చేసి ప్రైవేటులో కొనాల్సిన పరిస్థితి ఏర్పడిందని సదరు వ్యక్తి తెలిపారు. గద్వాలకు చెందిన మరో వ్యక్తి తన కుమారుడి కోసం టైప్1 డయాబెటీస్ ఇన్సూలిన్ కోసం ఆస్పత్రికి వెళ్తే స్టాక్ లేదని చెప్తున్నారని అందుకే ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నామని ఇందుకు నెలకు రూ.3వేల వరకు ఖర్చు అవుతోందని తెలిపారు.
ఒక్క రకం లేదు..స్టాక్స్‌పై ఆరా తీస్తాం కౌటిల్య, ఈడీ, టీజీఎంస్‌ఐడీసీ
రాష్ట్రంలో 7 రకాల ఇన్సూలిన్‌ను ప్రభు త్వ ఆస్పత్రులకు సప్లు చేస్తున్నాం. అయితే అందులో ఒక్క రకం అందుబాటులో లేదు. దీని కోసం త్వరలో టెండర్లు పిలుస్తున్నాం. ఇన్సూలిన్ కొరత ఉన్నట్లుగా మా దృష్టికి రాలేదు. ఒకవేళ అలాంటిదేమైనా ఉందేమో ఆరా తీస్తాం.
దేశంలో 3వ స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో ఏటికేడు మధుమేహం బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలో అత్యధిక మధుమేహం ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది షుగర్ రోగులుగా మారిపోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24.5 లక్షల మంది మధుమేహ రోగులున్నారు.
పంజాబ్, మహారాష్ట్ర తర్వాత అత్యధిక మధుమేహ రోగులున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఉద్యోగులు, వైట్‌కాలర్ జాబ్ చేసే వారికే షుగర్ వ్యాధి అనే పరిస్థితి మారిపోయింది. మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా ఇప్పుడు అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
సకాలంలో ఇన్సూలిన్ ఇవ్వకపోతే..
ఇన్సూలిన్ అనేది ఓ హార్మోన్. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. డయా బెటిస్ ఉన్న వారి శరీరం సరిపడ ఇన్సూలిన్ తయారుచేయలేదు. అం దుకే బయటి నుంచి వారికి ఇన్సూలిన్ కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుంది. సమయానికి ఇన్సూలిన్ ఇవ్వకపోతే రక్తం లో హైపర్‌గ్లుసైమియాతో షుగర్ లెవె ల్స్ పెరిగిపోతాయి.
అధిక దాహం, ఎక్కువ మూత్ర విసర్జన, అలసట, నీర సం, మైకం వచ్చినట్లుగా మారిపోవడం, కడుపునొప్పి, విరేచనాలు, వాం తులు వంటి ఇబ్బందులుంటాయి. క్ర మంగా కాలేయం, కిడ్నీలు, కళ్లు వంటి అవయవాలు దెబ్బతింటాయని వైద్యు లు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లు ఆహారం తీసుకునే విధంగానే వారి జీవితంలో ఇన్సూలిన్‌ను భాగంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఇన్సూలిన్ తీసుకోలేదంటే ఆరోగ్యానికి ప్రమాదం కోరితెచ్చుకున్నట్లుగా ఉం టుందని వైద్యులంటున్నారు.