26-05-2025 01:21:45 AM
ఓల్డ్ సిటీలో కాసా గ్రాండ్ తీరు ఇది
ఇరిగేషన్ నిబంధనలకు నిర్మాణ సంస్థ నీళ్లు
మొఘల్ కా నాలాను ఆనుకొని బ్లూషీట్స్ ఏర్పాటు
అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (విజయక్రాంతి): ఇరిగేషన్ నిబంధనలకు కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ నిర్మాణ సంస్థ నీళ్లు వదిలింది. చారిత్రాత్మక మొఘల్ కా నాలాను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నది.
ప్రచారమే అస్త్రంగా ప్రముఖులతో అడ్వర్టయిజ్ మెంట్లు చేస్తూ కనీసం పూర్తిస్థాయిలో పునాదులు కూడా తీయకముందే అడ్వాన్స్ బుకింగ్‌ల పేరుతో డబ్బులు దండుకుంటు న్నది. ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ నిర్మాణ సంస్థ పాత నగరంలోని కార్వాన్ సర్కిల్ గుడిమల్కాపూర్ డివిజన్‌లో నిర్మాణం చేపట్టింది. ఇది అమాయకులను బురిడీ కొట్టిస్తూ తాము అత్తాపూర్‌లో నిర్మాణం చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నది. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తి నట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది.
అడ్డగోలు వ్యవహారం
కాసాగ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ నిర్మాణ సంస్థ గుడిమల్కాపూర్ డివిజన్‌లో సుమారు 4 ఎకరాల స్థలంలో 33 అంతస్తుల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రచించింది. అయితే, ప్రస్తుతం పునాదులు కూడా పూర్తిస్థాయిలో తీయలేదు. అయి నా, అమాయకులైన జనాల నుంచి ఇప్పటికే బుకింగులు చేసుకోవడం గమనార్హం. కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ నిర్మాణ సంస్థ కోట్లు కుమ్మరిస్తూ ప్రచారమే ప్రధాన అంశంగా ముందుకు సాగడం గమనార్హం.
-నిబంధనలకు విరుద్ధంగా బ్లూ షీట్స్
మొఘల్ కా నాలాను కాసా గ్రాండ్ జీఎస్ ఇన్ఫినిటీ నిర్మాణ సంస్థ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్టు స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ నిబంధనల ప్రకారం నాలాను ఆనుకొని బ్లూషీట్స్, ఇతర నిర్మాణాలు చేయొద్దు. అయితే కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.
నాలా నుంచి 9 మీటర్ల మేర బఫర్ జోన్ ఉంటుంది. అందులో ఎలాంటి నిర్మాణాలు, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టొద్దు. కానీ, కాసా గ్రాండ్ నిర్మాణ సంస్థ మాత్రం నాలాకు ఆనుకుని బ్లూ షీట్స్ ఏర్పాటు చేసింది. పెద్దల అండ చూసుకొని కాసా గ్రాండ్ బరితెగిస్తున్నదని స్థానికులు చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యపు నిద్రలో ఉన్నారని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సైతం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పేర్కొంటున్నారు. నాలా కబ్జా విషయంపై కాసా గ్రాండ్ ప్రతినిధిని ‘విజయక్రాంతి’ ప్రతినిధి వివరణ కోరగా.. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడం గమనార్హం. కళ్ల ముందు కనిపిస్తున్న నాలా కబ్జాపై ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.