26-05-2025 01:14:33 AM
-అన్న వదిలిన బాణం ఆయనపైనే గురిపెట్టింది
-మనుగడ కోసమే కవిత ఆరాటం: బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): తాజా పరిస్థితి చూస్తుంటే ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఆమె సోదరుడు కేటీఆర్‌ను సవాల్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడం వల్లే బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం లుకలుకలు కొనసా గుతున్నాయన్నారు. ఢిల్లీలో ఆయన ఆది వారం మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు రాజకీయాల్లోకి అన్నలు వదిలిన బాణాలు ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో ఇప్పుడు అన్నలపైనే గురిపెట్టారని షర్మిల, కవితలను ఉదహరించారు.
కేటీఆర్‌ను ఇకపై తాను లెక్కపెట్టననే ధోరణి కవితలో కనిపిస్తోందన్నారు. రాష్ర్టంలో ఎమ్మెల్సీ కవిత కుట్రలు పనిచేయబోవన్నారు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ వారిద్దరూ కాకుండా ఎవరు బయటికి లీక్ చేసి ఉంటారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్ నాయకత్వాన్ని కవిత వ్యతిరేకి స్తున్నారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.
పదేళ్లుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడని కవితతో..రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పావులు కదుపుతోందని ఆరోపించారు. ఎన్నడూ ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడని కవిత ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఎవరూ నమ్మబోరని తెలిపారు.
ఏపీలో షర్మిలను కాంగ్రెస్ వాడుకున్న తీరుగానే తెలంగాణలో కవితను వాడుతోందన్నారు. మనుగడ కోసమే కవిత ఆరాటపడుతోందని అన్నారు. ఆమెకు కాంగ్రెస్‌పై ప్రేమ, బీజేపీపై ద్వేషం కనిపిస్తోందని అన్నారు. లిక్కర్ కేసుల్లో ఉన్న వారికి ప్రజల నుంచి తిరస్కారం తప్ప స్వాగతం ఉండబోదని కుండబద్దలు కొట్టారు.