26-05-2025 09:17:34 AM
హైదరాబాద్: ఎన్ఐఏ అధికారులు(National Investigation Agency) సిరాజ్, సమీర్ నుంచి స్టేట్ మెంట్ నమోదు చేయనున్నారు. మూడో రోజు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేలుళ్ల కోసం సిరాజ్, సమీర్ ఐదు చోట్ల రెక్కీ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబయిలో రెక్కీ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. విశాఖకు చెందిన విశ్రాంత రెవెన్యూ అధికారి పాత్రపై పోలీసులు కూపీ లాగారు.
హైదరాబాద్, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన 12 మందితో గ్రూప్ ఏర్పాటు చేశారు. సౌదీ, ఒమన్ దేశాల హ్యాండ్లర్ల నుంచి అందిన నిధులపైన మరింత లోతుగా ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఉగ్రవాద విదేశీ లింకులు, పేలుళ్ల కుట్ర, ఆర్థిక వ్యవహారాలపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సిరాజ్, సమీర్ సోషల్ మీడియా ఖాతాలపై, ఇతర రాష్ట్రాల్లో 'అహీమ్' సంస్థ మూలాలు, విదేశీ ఇంటర్నెట్ కాల్స్ పై అధికారులు ఆరా తీశారు. కీలక అంశాల్లో తెలియదు, గుర్తుచేదు, మరిచిపోయానంటూ సిరాజ్ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కస్టడీ మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు. అధికారులు కేసు కీలక అంశాలపై నేటి నుంచి విచారణ ముమ్మరం చేయనున్నారు.