calender_icon.png 1 May, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లిష్టపరిస్థితిలో దృఢసంకల్పం కావాలి

29-04-2025 12:00:00 AM

ఇది దేశానికి ఎంతో క్లిష్టపరిస్థితి. ఇటువంటి సమయంలో ఎంతో దృఢసంకల్పం గల నాయకత్వం దేశానికి అవసరం. ఈ నేపథ్య విశ్లేషణలోకి వెళితే మనకు పలు వాస్తవాలు తెలుస్తాయి. జమ్ముకశ్మీర్‌ను హఠాత్తుగా కేంద్ర పాలితంగా మార్చారు. అంటే, మొత్తం బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. అక్కడ ఎన్నికలు జరిపిస్తే సరిపోదు. మళ్లీ ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పాలి.

రెండేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చాలాసార్లు ‘ఈ కేంద్ర పాలితమ’నే రూపును మార్చేస్తామనీ ప్రభుత్వం చెప్పింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఆ అఫిడవిట్‌ను నిజం చేసేదెవరు? కశ్మీర్‌లో ప్రతి అడుగు, ప్రతి సంస్కరణ చర్యల నూ మన దేశం సమైక్యతకు ఉపయోగించాలి. కేవలం ‘సత్యమేవ..’ అంటూ ఉప న్యాసాలు చెబితే సరిపోదు. అమాయక ప్రజలను టెర్రరిస్టులకు బలి చేసిన వారెవరు?

పాకిస్థాన్ టెర్రరిజాన్ని మన కశ్మీర్ కు బలి చేస్తూంటే ఏం చేద్దాం? ముస్లింలను ఇస్లాం సిద్ధాంతం ప్రకారం ‘కాఫిర్లు’ అంటూ, హిందువులను టెర్రరిస్టులు చంపుతూ ఉంటే పాకిస్థాన్ ప్రజలకు, ఈ మత సిద్ధాంత నాయకులకు,  ప్రభుత్వానికి బాధ్యత లేదా? పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తోపాటు మరికొన్ని భూభాగాలతో మన ప్రియమైన ‘నాదేశం.. అఖండ భారత్’ అనే నినాదాలు చేసే పెద్దలు, ‘ఒక నలుగురు టెర్రరిస్టులు మన నేలమీద మన వారిని చంపేస్తుంటే’ ఏం చేస్తున్నారు? 

అంతటి రాజనీతిజ్ఞత అవసరం

రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలితం కిందికి మార్చేసారు. ‘కేంద్రపాలిత ప్రాంతం’ అంటే కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత కదా? అంటే, రాష్ట్ర బాధ్యత ఉండదనే కదా!  మరి, ఇంత జరుగుతుంటే, కేంద్రం ఏం చేసినట్టు? “యుపీఏ దుష్టపాలనవల్ల టెర్రరిస్టులు జనాన్ని చంపేస్తున్నారని” అనేవాళ్లు అప్పట్లో ఈ కొందరు. అవును నిజమే.

2013 నుంచి 2025 దాకా ఇవే పాత మాటలేనా! మరి, మనం 2025 దాకా ఏం చేస్తున్నట్టు? ఇక్కడ 2013లో అప్పటి ప్రతిపక్ష నాయకుడి ఈ ప్రకటన మరీ విడ్డూరం. ఇది దేశ రక్షణమంత్రిగా చెప్పిన మాటలు కావు. టెర్రర్ దాడులను విమర్శిస్తూ ప్రతిపక్షాల మధ్య విమర్శించే రాజ్‌నాథ్ 2013లో చేసిన వ్యాఖ్య.

అందులో నాటి సర్కారును తీవ్రంగా విమర్శించారు. అందులో చాలా నిజం ఉందికూడా. ఆనాటి “యూపీఏ ప్రభుత్వం పని చేయడం లేదని” అన్నారు. ‘కాని, ఇప్పుడు పదేళ్ల తరువాత కూడా టెర్రరిజం కాటేస్తున్నదని’ అవే మాటలు చెప్పుకోవడం న్యాయమా? 

తప్పుడు ప్రచారాలు, విజృంభిస్తున్న ఫేక్‌న్యూస్, ఒకరి నొకరిని సహించని హేట్ రాజకీయాలు నడిపించడం.. వంటివన్నీ సరైనవి కావు.  ‘అఖండ భారత్ సాధిస్తామని’ అంటారు. కాని, ఏ ఉపన్యాసాలు చేయకుండానే భారతదేశ సమగ్రతను కాపాడుతూ పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను రెండు ముక్కలు చేసిన రాజనీతిజ్ఞత ఎక్కడికి పోయిందని విమర్శిస్తుంటారు. రెండు సైన్యాలను నడిపిన మానెక్ షా ధైర్యం ఇక్కడ గమనార్హం. 

యుద్ధానికీ ఒక పకడ్బందీ ప్రణాళిక

1971 భారత పాకిస్థాన్ యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ఆ పద్మభూషణ్‌ను గొప్ప సైనిక నేతగా గుర్తిస్తున్నాం. గుజరాత్‌లోని ఒక ప్రసంగ సంఘటన ఇక్కడ ప్రస్తావించదగ్గది. ఆనాడు మానెక్ షా ప్రసంగం మొదలుపెట్టగానే సభికులు “గుజరాతీలో మాట్లాడు” అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. కంటతడి చూపుతో ప్రేక్షకులను పరిశీలిస్తూ, “నేను భారతదేశంలోని వివిధ ప్రాంతాల సైనికులతో పని చేసినప్పుడు, వారి భాషలు నేర్చుకున్నాను.

కానీ, గుజరాతీ సైనికులతో తక్కువగా పనిచేశాను కాబట్టి, ఈ భాష నేర్చుకునే అవకాశం రాలేదు..” అన్నారు. అప్పుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యం చేసింది. తనదైన శైలిలో  కొంచెం వ్యంగ్యంతో, కొంచెం సిగ్గుతో కఠినమై అథారిటీతో ఆయన అలా ప్రకటించారు. అప్పుడు అక్కడ గుండుసూది (పిన్) పడినా వినిపించనంత నిశ్శబ్దం ఏర్పడిందని చెబుతారు. అందరూ నోరు మూసుకున్నారు. అది మౌనం అంటే.

మానెక్ షాకు నిజానికి గుజరాతీ భాష పరిచయం ఉండే అవకాశముంది. కానీ, ఆయన వ్యక్తిత్వాన్ని, వంగ్య విమర్శను దెబ్బ కొట్టినట్టుగా ఈ సంఘటన విస్తృతంగా ప్రాచుర్యంలో ఉంది. ఒకమాట మాత్రం నిజం, అలాంటి వారంతా వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తారు. చాలా మంచి లక్షణాలు కూడా ఉన్నవారే. గుజరాత్‌లో జన్మించిన గాంధీ ఈ దేశానికి జాతిపిత కూడా. మనకు వ్యాపారం కన్నా మన దేశం అనే జాతీయత అవసరం. 

మరో సంఘటన. 1971 ఏప్రిల్‌లో మంత్రివర్గ సమావేశంలో, అందరూ అప్పట్లో నియంత అనుకుంటున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, జనరల్ మానెక్ షాను “పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?” అని అడిగారట. జవాబు ఎం త ధైర్యంగా చెప్పారో వినండి. “మన ఇన్‌ఫ్యాంట్రీ డివిజన్స్ ఆయుధాలు ఎక్కడెక్క డో నిలిపి ఉండి ఉన్నారు. యుద్ధ యూని ట్లు, కాల్బలాలు తడిసి ఉన్నాయి.

కేవలం పన్నెండు ట్యాంకులు మాత్రమే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అవికూడా ధాన్యం కోతకు అవసరమైన రైలు బోగీలకోసం పోటీ పడాల్సి వస్తున్నది..” అని ఆయన చెప్పారు. “రానున్న వర్షాకాలం తరువాత హిమాలయాల్లోని రోడ్డుమార్గాలు తెరుచుకుంటాయి. భారీ వరదలు కూడా రావ చ్చు..”

అనికూడా ఆయన హెచ్చరించారు. అప్పుడు ఇందిరాగాంధీ మంత్రివర్గ సభ్యు లు వెళ్లిపోయిన తర్వాత, మానెక్ షా ‘రాజీనామా ఇద్దామని’ అనుకున్నారుట. అప్పుడు ఆమె “రాజీనామా అవసరం లేదు. దానికి బదులు మరేం చేద్దామో చెప్పండి?” అని అడిగారు. ‘తాను నిర్ణయించే సమయానికి యుద్ధం ప్రారంభిం చేందుకు అనుమతిస్తే, విజయాన్ని హామీ ఇవ్వగలను’ అని ఆయన చెప్పారు. 

ఆ ప్రతిపాదనకు ఇందిరాగాంధీ ఒప్పుకున్నారు. ఆ విధంగానే మన దేశం గెలిచిందనేది చరిత్ర. ఎమర్జెన్సీ ఒక చీకటి కథ, సందేహం లేదు. కాని, ‘ఇందిర విజయేందిర’ అని రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజపాయ్ స్వయంగా సమర్థించారు. 

చిత్తశుద్ధి ఎక్కడుంది? 

అమెరికాలో ఆకాశాలను తాకే రెండు అద్భుత భవనాలను విమానాలతో కూల్చి న దుర్మార్గచర్య ద్వారా వందలాదిగా ప్రాణనష్టం జరిగింది. నిన్న మొన్నటి పహల్గాంలో 26 మంది (అంతకన్నా ఎక్కువే అయి ఉండవచ్చు) బలైన నేరం చిన్నదేం కాదు. “వెంటాడి, వెంటాడి ఒక్కొక్కణ్ని పట్టుకుని శిక్ష వేస్తాం” అంటున్న కేంద్ర ప్రభుత్వానికి వందలాది వందనాలు.

అయితే, ఆనాడు అమెరికా ఏం చేసిందేమిటి? మాటలు కాదు, తూటాలు కాదు, రాజకీయమూ కాదు. ఎక్కడ, ఎక్కడున్నా సరే వేటాడి పట్టుకుని అమెరికాను కాపాడుకోవడానికి ఆ దేశం చూపిన కమిట్ మెంట్ ప్రధానం. అది మనకు ఆదర్శం కావాలి. కమిట్‌మెంట్ అంటే కట్టుబాటు, దీక్ష.

మామూలుది కాదు, అకుంఠిత దీక్ష కావాలి. ఉందా? ఒక్కో మరణానికి కన్నీటి బిందువులనైనా ఇచ్చుకున్నామా? క్రికెట్ మైదానంలో ఓ రెండు క్షణాలు నిలబడితే చాలా! కోట్లకోట్ల వ్యాపారం కోసం, ప్రచారం కోసం మౌనమే సరిపోతుందా? ఒక్కో ప్రాణానికి, ఒక్కో సైనికుడి మొత్తం జీవితానికి సరిపోయే ఆర్థిక సహాయం చేయగలమా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకుల స్ఫూర్తితో ప్రతి సైనికుడు అపార శక్తిగా మారాలి.

మహా ధైర్యంగా, రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించి, నిజం చెప్పి, వ్యూహం నేర్పగల అధికారుల ప్రణాళిక, అదే గుండెనిబ్బరంతో భారతదేశాన్ని గెలిపించిన గొప్ప నాయకులు ఇవాళ మనకు అవసరం. ఆ విధంగా ‘మన దేశాన్ని గెలిపిద్దాం.

టెర్రరిస్టులను మట్టి కరిపిద్దాం. పనికిరాని రాజకీయాలు కాదు, మన అందాల కశ్మీర్‌ను గెలిపించుకుందాం. మన రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజనీతిని నిలబెడదాం. పహల్గాంలో బలైన ఒక్కో ప్రాణానికి, రాలిన కన్నీటి బిందువులకు సమానంగా మన సమైక్యత, సమగ్రతలను రక్షించుకుందాం’. ఇంతటి శక్తివంతమైన కమిట్‌మెంట్‌తో పనిచేద్దాం.