calender_icon.png 1 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఉపశమనం!

29-04-2025 12:00:00 AM

మొన్నామధ్య ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలపై కాస్త వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు విదేశీ విద్యార్థుల వీసాల రద్దు విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారు. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్లి, బహిష్కరణ ముప్పు ఎదుర్కొన్న వందల మంది విద్యార్థులకు భారీ ఉపశమనం లభించినట్లయింది. ఇది నిజంగా సంతోషకర విషయం.

వీసాల అంశంలో ట్రంప్ ఒకవేళ మొండిగా ప్రవర్తించి ఉంటే వందల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లేది. ఇదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరేది. ట్యూషన్ ఫీజులు, కళాశాల ఫీజులు, జీవన వ్యయాల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, అగ్రరాజ్యంలో ఉపాధి అవకాశాలు మెరుగు పడటానికి అంతర్జాతీయ విద్యార్థులు దోహద పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

2023 గణాంకాల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు రకరకాల ఖర్చులద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు రికార్డు స్థాయిలో 43.8 బిలియన్ డాలర్లను సమకూర్చినట్టు తెలుస్తున్నది. అయితే, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంతలా దోహదపడుతున్న విదేశీ విద్యార్థులను తమ అభీష్టానికి వ్యతిరేకంగా పాలస్తీనకు మద్దతు పలికారనే కారణంతో డ్రైవింగ్ ఉల్లంఘనలు వంటి చిన్నచిన్న తప్పులను సాకుగా చూపి అమెరికా నుంచి తరిమేయాలని ట్రంప్ భావించారు.

ఇందులో భాగంగా సుమారు 11 లక్షలమంది విదేశీ విద్యార్థుల స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్‌ను పరిశీలించి ఇందులో 5 వేల మంది విద్యార్థుల వివరాలను అధికార యంత్రాంగం తొలగించింది. కొన్ని నివేదికల ప్రకారం ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 208 యూనివర్సిటీల్లోని 1800 మంది విదేశీ విద్యార్థులు తీవ్రంగా ప్రభావితమైనట్టు తెలుస్తున్నది.

వీరిలో భారతీయులు కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో భయాందోళనలకు గురైన కొందరు విద్యార్థులు బహిష్కరణ లేదా నిర్బంధ ముప్పు నుంచి తప్పించుకునేందుకు స్వచ్ఛందంగా అమెరికాను వీడితే మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అతికొద్దిమంది మాత్రం కోర్టులకు ఎక్కి ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. న్యాయస్థానాల్లో నమోదైన వందలాది పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తులు అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుబట్టారు.

దీంతో ట్రంప్ యంత్రాంగం దిగి వచ్చింది. విద్యార్థుల వీసాలు/ చట్టబద్ధ హోదాను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను పునరుద్ధరించింది. అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రంప్.. నిరసన అనేది వ్యక్తిగత విషయమని, నిరసన తెలిపేందుకు అక్కడ ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది.

అలా కాకుండా లేనిపోని కారణాలతో యూనివర్సిటీలకు నిధులను నిలిపి వేయడంతోపాటు విదేశీ విద్యార్థుల్లో భయాందోళనలు రేకెత్తించే చర్యలు తీసుకుంటే మేధోసంపద అమెరికా నుంచి తరలిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇదే జరిగి ఉన్నత విద్యావ్యవస్థ కుప్పకూలితే అది అమెరికాతోపాటు ప్రపంచానికి నష్టం చేకూరుస్తుందని గుర్తెరిగి ట్రంప్ మసులుకుంటే మంచిది.