11-09-2025 07:02:52 PM
చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల బృందం చిట్యాల మండలంలోని కైలాపూర్, ఏలేటి రామయ్య పల్లి గ్రామాల్లో వివిధ పంటలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త ఏ.విజయ భాస్కర్ మాట్లాడుతూ, పత్తి పంటలో ప్రస్తుత తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ మొక్క మొదలు తడిచేవిధంగా పిచికారి చేసుకోవాలన్నారు. కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రా, 1 గ్రాము స్ట్రెప్టో సైక్లిన్ పది లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకర్షణ బుట్టలను అమర్చుకోవాలన్నారు. వరి పంటలో కాండం తొలచు పురుగు నివారణకు క్లోరాంట్రనిలిప్రో 0.3 మి లీటర్ల చొప్పున లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వెంకట రాజకుమార్, విశ్వతేజ, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.